ఓ బిడ్డకు జన్మనిచ్చి తండ్రిని నేనే అవుతా… ట్రాన్స్ జెండర్ డాక్టర్

ఓ బిడ్డకు జన్మనిచ్చి తండ్రిని నేనే అవుతా… ట్రాన్స్ జెండర్ డాక్టర్

అహ్మదాబాద్ కు చెందిన జెస్నూర్ డయారా ఓ ట్రాన్స్ జెండర్. డయారా వృత్తి రీత్యా ఓ డాక్టర్. ఆమె వయసు పాతికేళ్లు. శాస్త్రీయంగా తల్లి, తండ్రి తానే కావాలని కోరుకుంటున్నారు. గోద్రా ప్రాంతంలోని పంచమహల్ అనే కుగ్రామంలో డయారా జన్మించారు. అబ్బాయిగానే పుట్టినా, మానసికంగా తనను తాను స్త్రీగానే భావించిన జెస్నూర్ డయారా రష్యాలో వైద్య విద్య అభ్యసించింది. గుజరాత్ లో తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా చరిత్ర సృష్టించింది.

అయితే, బాల్యం నుంచి అమ్మాయిల లక్షణాలు అధికంగా ఉన్న డయారా స్త్రీగా మారాలని బలంగా నిశ్చయించుకున్నారు. స్త్రీగా మారడమే కాదు, ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు మధురిమలు చవిచూడాలని తలపోస్తున్నారు. అంతేకాదు ఆ బిడ్డకు తానే తండ్రిని అవ్వాలని కూడా డయారా వినూత్నంగా ఆలోచించారు. అందుకే తాను పురుషుడిగా ఉన్నప్పుడే… అహ్మదాబాద్‌, ఆనంద్‌లోని ఓ ఐవీఎఫ్‌ ఆస్పత్రిలో వీర్యాన్ని భద్రపరిచింది. స్త్రీగా మారే క్రమంలో ఇప్పటికే పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. త్వరలో నిర్వహించే శస్త్రచికిత్సతో తాను పూర్తిగా స్త్రీగా మారిపోనున్నారు. ఆ తర్వాత తన వీర్యంతోనే తాను తల్లి కావాలన్నారు డాక్టర్ జెస్నూర్ డయారా.. ఆమె కల నిజమైతే ఓ బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన మొట్టమొదటి వ్యక్తిగా జెస్నూర్ డయారా పేరు చరిత్రలో నిలిచిపోతుంది.