ఓస్లో: ఇండియా గ్రాండ్ మాస్టర్లు డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీలో తొలి ఓటమిని చవిచూశారు. బుధవారం వెస్లీ సోతో జరిగిన క్లాసికల్ రెండో రౌండ్ గేమ్‌ను గుకేశ్ 116 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. స్టార్టింగ్ నుంచి అద్భుతంగా ఆడిన ఇండియన్ ప్లేయర్ ఓ దశలో గెలుపు అంచుల్లో నిలిచాడు.
కానీ వెస్లీ వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి గేమ్‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. ఇక ఫలితం కోసం ఇద్దరి మధ్య నిర్వహించిన ఆర్మగెడాన్ టైబ్రేక్‌లో వెస్లీ పూర్తి ఆధిక్యం చూపెట్టి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలీరెజా ఫిరౌజాతో జరిగిన గేమ్‌లో ప్రజ్ఞానంద 60 ఎత్తుల వద్ద ఓటమిపాలయ్యాడు.
ఈ రౌండ్ తర్వాత గుకేశ్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, ప్రజ్ఞానంద ఒకటిన్నర పాయింట్లతో చివరి ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్ విభాగంలో దివ్య దేశ్‌ముఖ్.. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై గెలిచింది. ఈ విజయంతో దివ్య మూడు పాయింట్లతో రెండో ప్లేస్‌కు చేరుకోగా, హంపి ఒక పాయింట్‌తో చివరి ప్లేస్‌లో ఉంది.
