దిశను మార్చుకున్న గులాబ్ తుఫాన్..

దిశను మార్చుకున్న గులాబ్ తుఫాన్..

హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జల కళతో సంతరించుకున్నాయి. వర్షాల ధాటికి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కాగా.. తాజాగా డిజాస్టర్ మేనేజ్‎మెంట్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గులాబ్ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రే దిశను మార్చుకొని తెలంగాణ నుంచి మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల వైపు మళ్లినట్లు అధికారులు తెలిపారు. దాంతో హైదరాబాద్ ప్రజలకు కొంత ఉపశమనం కలగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ తుఫాన్ దిశ మార్చుకున్న కారణంగా నగరంలో చాలా తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు. 

కాగా.. గులాబ్ తుఫాన్ దిశను మార్చుకున్నా కూడా.. మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ తుఫాను వాయుగుండంగా మారి బలహీనపడిందని... దాంతో దాని ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వానలు కురుస్తాయన్నారు. 

జోరు వానలతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి సీజన్‎లో సాధారణంగా ఇప్పటి వరకు 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేదని.. కానీ, ఈసారి మాత్రం సొమవారానికే 95.70 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయ్యిందని తెలిపింది. సాధారణ వర్షపాతం కంటే ఇది 35 శాతం ఎక్కువని అధికారులు పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో అత్యధికం.. 21 జిల్లాల్లో అధికం, 7 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్‎లో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. వాతావరణ శాఖ అలర్ట్‎తో  ప్రభుత్వ శాఖలన్నీ అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలవారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్ సూన్ టీమ్‎లు, 92 స్టాటిస్టిక్స్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. 

For More News..

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

ఎర్రబస్సు నుంచి ఎయిర్ బస్ దాకా అన్నీ తెలంగాణకే