ఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ ఎందుకు పాటిస్తలేరు?

ఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ ఎందుకు పాటిస్తలేరు?
  • లోక్​సభ స్పీకర్​, చీఫ్​ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తం
  • కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ లీడర్​ గుమ్మడి కుమారస్వామి

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్​ ఎందుకు పాటించడం లేదని కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ లీడర్, ఐఎన్​టీయూసీ స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి ప్రశ్నించారు. ఎవరి అండ చూసుకుని ఎంపీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. 

సోమవారం గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రామగుండం టౌన్​లో ఈఎస్​ఐ హాస్పిటల్​ స్థల పరిశీలనకు ఎంపీ వంశీకృష్ణ వచ్చినప్పుడు అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సోమవారం చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ పేరు లేదన్నారు. 

గతంలో పెద్దపల్లిలో జరిగిన సభలో ఈ వ్యవహారం గురించి ఎంపీ స్వయంగా సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. అధికారుల్లో మార్పురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్​ విషయంలో ఎంపీకి జరుగుతున్న అన్యాయంపై లోక్​సభ స్పీకర్, నేషనల్​ ఎస్సీ, ఎస్టీ కమిషన్, చీఫ్​ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

మున్సిపల్​కార్పొరేషన్‌లో​ దారి మైసమ్మ గుడులను కూల్చివేతలకు సంబంధించి ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మీటింగ్​లో లీడర్లు రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్​ దొర, మగ్గిడి దీపక్ తదితరులు పాల్గొన్నారు. 

అలాగే ఎన్టీపీసీ బూడిదను తరలించే వ్యవహరంలో కుందనపల్లి గ్రామస్తులకు జేసీబీ మిషన్లు పెట్టుకునే అవకాశం కల్పించి , మొగల్​పహాడ్​ గ్రామస్తులకు ఇవ్వకపోవడం సరైంది కుమారస్వామి అన్నారు. శాంతిభద్రతల సమస్య లేకపోయినా ఎన్టీపీసీ సీఐ, అంతర్గాం ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిపై నేషనల్​ హ్యూమన్​ రైట్స్​ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మొగల్​పహాడ్​ గ్రామస్తులు చిలుక రాజేశం, దుబాసి ప్రవీణ్​, లింగయ్య, శ్రీనివాస్​ పాల్గొన్నారు.