టెర్రరిస్టుల కాల్పుల్లో వరంగల్ వాసి మృతి

టెర్రరిస్టుల కాల్పుల్లో వరంగల్ వాసి మృతి

వరంగల్, వెలుగు : నైజీరియాలోని ఓ ప్రముఖ టైల్స్​కంపెనీలో పనిచేస్తున్న గ్రేటర్‍ వరంగల్‍కు చెందిన గుర్రపు రమేశ్‍ (38) అక్కడి టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయాడు. శుక్రవారం సాయంత్రం ఆయన పని ముగించుకుని కంపెనీ బస్​లో తన ఫ్లాట్‍కు వెళుతున్నారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో బోకోహరాం ఇస్లామిక్ టెర్రరిస్టులు 30 మంది మార్గమధ్యలో ఆ కంపెనీ బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రమేశ్‍తో పాటు ఇద్దరు నైజీరియా ఆర్మీ జవాన్లు, బస్‍ డ్రైవర్‍ కూడా స్పాట్లోనే మరణించారు. మరో ముగ్గురిని టెర్రరిస్టులు కిడ్నాప్‍ చేశారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న వరంగల్‍వాసులు శనివారం ఉదయం ఈ విషయాన్ని  ధ్రువీకరించారు. రమేశ్​ మృతి వార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆయన మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన డెడ్​బాడీని స్వదేశానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కంపెనీ కూడా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్‍ గోపాలస్వామి గుడి ప్రాంతానికి చెందిన రమేశ్‍కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన ఐదేళ్ల క్రితం నైజీరియా వెళ్లాడు. అక్కడ కోగి రాష్ట్రంలోని అజకూటలో నివాసం ఉంటున్నాడు. ఓ టైల్స్​ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబాన్ని కలవడానికి ఈ ఏడాది వరంగల్‍ వచ్చిన రమేశ్‍.. ఫిబ్రవరిలో తిరిగి నైజీరియా వెళ్లాడు.