"గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ ..తస్మై శ్రీ గురవే నమః" తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రధానం. ఆ తర్వాతే దైవం. అలాంటి ఆ గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుక గురుపౌర్ణమి. దీనినే వ్యాస పూర్ణిమ, గురుపౌర్ణిమిగా భావిస్తారు. వ్యాసుడు మానవాళికి ఆదిగురువు అని విశ్వాసం.
వ్యాస మహర్షి జన్మతిథిని పురస్కరించుకుని ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున 2023 జూలై 03 సోమవారం గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. దక్షిణ షిరిడీగా పేరుగాంచిన దిల్ షుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాబాను దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు నిండిపోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దిల్ షుఖ్ నగర్ షిరిడీ సాయి ట్రస్ట్ చైర్మన్ గుండా మల్లయ్య గుప్త తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే గురు పూర్ణిమ రోజు సాయినాధుని సమాధి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు తెలిపారు. సుమారు 25 వేల నుంచి 30 వేల మంది గురుపూర్ణిమ ప్రత్యేక పూజలకు హాజరవుతారని టెంపుల్ ట్రస్ట్ అంచనా వేసింది. భక్తులకు భోజనాలు, వాహనాల పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ట్రస్ట్ సభ్యులు చెప్పారు.
ప్రత్యేక కార్యక్రమాలు
ఉత్సవాల్లో భాగంగా జూన్ 03 సోమవారం ఉదయం 05.15 నిమిషాలకు షిర్టీసాయికి కాకడ హారతీ ఇచ్చారు. అనంతరం 05.45 నిమిషాలకు అఖండ పారాయణ ముగింపు కార్యక్రమం జరిగింది. తర్వాత సాయి ఫోటోతో, పోతి ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం సమయంలో భజన కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 9.15 నిమిషాలకు సాయి రథోత్సవం జరగనుంది. సాయినాథ్ మహారాజ్ సమాధి ఆలయం రాత్రంతా దర్శనానికి తెరచే ఉంటుందని వెల్లడించారు.
