Heavy rains: అతి భారీ వర్షాలు..20 ఏళ్లలో ఇదే మొదటిసారి

Heavy rains: అతి భారీ వర్షాలు..20 ఏళ్లలో ఇదే మొదటిసారి

గురుగ్రామ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జులై 08వ తేదీ శనివారం భారీ వర్షాలు కురవడంతో రోడ్లపై మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. గురుగ్రామ్ ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వేపై భారీగా నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జులై 09వ తేదీ ఆదివారం ఉదయం కుండపోత వాన పడింది. ఉదయం 8 గంటల వరకు గురుగ్రామ్ లో 71 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  

జలమయం..

బీభత్సమైన వర్షానికి గురుగ్రామ్లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్ 1 మరియు 3, సెక్టార్ 4, 5, పాలం విహార్, సెక్టార్ 22, సెక్టార్ 10ఎ, సెక్టార్ 9, సెక్టార్ 48, సన్‌సిటీ టౌన్‌షిప్‌లలోని లోతట్టు ఇళ్లలోకి నీరు చేరింది. సోహ్నా రోడ్, సుభాష్ చౌక్, ఉద్యోగ్ విహార్, గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్, నర్సింగ్‌పూర్ ప్రాంతాలలో మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  భారీ వర్షాల ప్రభావంతో  కార్లు, బైకులు చెడిపోయాయి. భారీ వర్షాల కారణంగా అన్ని అండర్‌పాస్‌లు, సబ్‌వేలను మూసివేస్తున్నట్లు   గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ  ప్రకటించింది. 

సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు..

గురుగ్రామ్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వర్షాలకు లోతట్టుప్రాంతాలు మునిగిపోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. జీఎండీఏ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు..ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. 

మూడు రోజులు వర్షాలు..

హర్యానాలోని గురుగ్రామ్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జులై 11, 12వ తేదీల్లో హర్యానాలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్సు ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జులై 09, 10 తేదీల్లోనూ వర్షాలు దంచికొడుతాయని పేర్కొంది. కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, పంచకుల జిల్లాలకు  రెడ్ అలర్ట్ ప్రకటించింది.