కరోనా భయంతో మూడేళ్లు ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనా భయంతో మూడేళ్లు ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనా బారిన పడుతామనే  భయంతో ఓ 33 ఏళ్ల మహిళ తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి  మూడేళ్లపాటు గృహనిర్బంధంలోనే ఉండిపోయింది.  పోలీసులు రంగంలోకి దిగి వారిని ఆసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటన గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.  గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్‌‌ ప్రాంతానికి చెందిన మున్మున్‌ మాఝీ అనే మహిళ, తన కొడుకు...  కరోనా మహమ్మరి వచ్చినప్పటి నుంచి అంటే 2020 నుంచి గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఆమె తన భర్త సుజన్ మాఝీను కూడా లోపలికి అనుమతించలేదు. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. తర్వాత మరో ఇళ్లును అద్దెకు తీసుకున్నాడు. తన భార్య, కొడుకుతో అప్పుడప్పుడు వీడియో కాల్ లో మాట్లాడేవాడు.  నెలనెలా ఇంటి అద్దె చెల్లించి, కరెంటు బిల్లులు కట్టి, కిరాణా, కూరగాయలు కొనుక్కొని  మెయిన్ డోర్ బయటే పెట్టేవాడు.  ఇలా మూడేళ్లు గడిచిపోయింది.

కరోనా తగ్గుముఖం పట్టి, లాక్ డౌన్ ఎత్తేసి అంతా మాములు అయినప్పటికీ  ఆమె మాత్రం తన కొడుకుతో కలిసి అలాగే నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చజెప్పినా వినలేదు. చివరికి ఆమె భర్త చక్కర్‌పూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. మున్మున్‌ కాస్త సైక్రియాట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో చాలా చెత్త పేరుకుపోయిందని, ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే అవాంఛనీయమైన ఘటన జరిగి ఉండేదని పోలీసులు చెప్పారు. ఇంట్లో గ్యాస్ స్టవ్ కు బదులు ఆమె ఇండక్షన్ ద్వారా వంట చేసుకునేదని తెలిపారు. తన భార్య, కొడుకును రక్షించినందుకు ఆమె భర్త సుజన్‌ పోలీసులకు ధన్యవాదాలు చెప్పాడు.