బిడ్డకు జన్మనిచ్చిన గురుకులం స్టూడెంట్

బిడ్డకు జన్మనిచ్చిన గురుకులం స్టూడెంట్
  • హాస్టల్ బాత్రూంలో ప్రసవం
  • సంగారెడ్డిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • ప్రిన్సిపల్ సస్పెన్షన్ 
  • డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్సు తొలగింపు

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: హాస్టల్ బాత్రూంలో గురుకులం స్టూడెంట్ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఎవరికి చెప్పకుండా ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనార్టీ జూనియర్ బాలికల కాలేజీలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న సిర్గాపూర్ ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో ముళ్లపొదల్లో పసిపాప ఏడుపు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బిడ్డకు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించిన ఎస్సై నారాయణ అనంతరం సంగారెడ్డిలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అనంతరం పోలీసులు విచారణ ప్రారంభించారు. నారాయణఖేడ్ మైనార్టీ గురుకుల కాలేజీలో ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్న బాలిక ప్రేమ వ్యవహారం కారణంగా ఒకరిని నమ్మి మోసపోయి బిడ్డకు జన్మనిచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

బాలిక గర్భం దాల్చిన విషయం గురుకుల సిబ్బంది గుర్తించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా మెడికల్ సిబ్బంది స్టూడెంట్స్ కు చెకప్ చేస్తున్నా గుర్తించలేదు. తొమ్మిది నెలలపాటు హాస్టలలో ఉంటూ బాలిక తన కడుపులో పసికందును మోసింది. చివరకు గత నెల 24న బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో గురుకుల ప్రిన్సిపల్ బాలిక తల్లిదండ్రులను పిలిపించి వారికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు. పోతూ పోతూ ఆ తల్లిదండ్రులు సిర్గాపూర్ ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో ముళ్లపొదల్లో బిడ్డను వదిలేసి కూతురిని ఇంటికి తీసుకెళ్లారు. బాలిక గర్భానికి ఖాజాపూర్ కు చెందిన యువకుడి ప్రేమ వ్యవహారమే కారణమా లేక గురుకులానికి చెందిన మరెవరైనా అనే కోణంలో సిర్గాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల కాలేజీ ప్రిన్సిపల్ మంజుల సస్పెండ్ కాగా డిప్యూటీ వార్డెన్ నసీమా బేగం, స్టాఫ్ నర్సు సునీతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు మైనార్టీ గురుకులాల సంస్థ సెక్రెటరీ షఫీఉల్లా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఖేడ్ మైనార్టీ గురుకుల కాలేజీ ప్రిన్సిపల్ గా టీజీటీ(ఇంగ్లీష్) టీచర్ ఉమారాణిని నియమించారు.