
- ఏర్పాట్లు పూర్తి చేసిన శ్రీషిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్
దిల్ షుఖ్ నగర్, వెలుగు: దక్షిణ షిరిడీగా పేరొందిన దిల్ షుఖ్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు మూడు రోజలు పాటు గురుపౌర్ణమి వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శ్రీషిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్, సాయి బాబా దేవాలయం చైర్మన్ శ్యాంకుమార్ తెలిపారు. మంగళవారం సంస్థాన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే గురుపౌర్ణమి వేడుకలకు 80 వేల మంది హాజరవుతారని చెప్పారు. ఈసారి గురువారం గురుపౌర్ణమి తిథి రావడంతో లక్ష మంది భక్తులు వచ్చే అవకాశముందన్నారు.
లైవ్ టెలికాస్ట్, ప్రత్యేక క్యూ లైన్లు..
బాబా దర్శనానికి వచ్చే చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్‌లు, పోలీస్ కంట్రోల్ రూంలు, మంచినీటి కేంద్రాలు, ప్రథమ చికిత్స కేంద్రం అందుబాటులో ఉంచారు. సంస్థాన్ ప్రవేశద్వారం బయట, ముఖద్వారం(ఆర్చ్) వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేస్తున్నారు. రాజధాని థియేటర్ లైన్, అన్నపూర్ణ క్యూ కాంప్లెక్స్ లైన్, పుల్లారెడ్డి పాఠశాల లైన్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.