పండుగలు అంటేనే ఆచారాలు, కట్టు–బొట్టు, ఐక్యతను చాటి చెప్పేవి. భద్రాచలం అటవీ ప్రాంతంలోని గొత్తికోయ గూడేల్లో జరిగే ‘గాదె పండుగ’ కూడా అలాంటిదే. ఛత్తీస్‍గఢ్ నుంచి వలస వచ్చిన ప్రత్యేక ఆదివాసీ తెగ గొత్తికోయ. పంటలు చేతికి వచ్చాక తమ గూడేల్లో గాదె పండుగ చేస్తారు వీళ్లు. ఈ పండుగను రెండు రోజులు చేసుకోవడం ఆనవాయితీ. మరో విషయం ఏమంటే.. గాదె పండుగ అయిపోయాకే జిగురు, తేనె, తునికాకు, కొండ చీపుళ్ల వంటి అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు వెళ్తారు గొత్తి కోయలు.
గాదె అంటే వెదురుతో అల్లిన పెద్ద బుట్ట. పండించిన పంటని నిల్వ చేసేందుకు ఈ గాదెల్ని ఉపయోగిస్తారు. అందుకే ఈ పండుగకి గాదె పండుగ అని పేరొచ్చింది. గొత్తికోయల్లో ఓ కట్టుబాటు ఉంటుంది. ఏ విషయంలోనైనా కుల పెద్దల నిర్ణయాన్నే అనుసరిస్తారు వాళ్లు. ఏటా ఫిబ్రవరి నెల రెండోవారం నుంచి నాలుగోవారం వరకు అన్ని గూడేల్లో గాదె పండుగ చేయాలని కుల పెద్దలు చెప్తారు. ఊరి చివర ఉన్న దేవర ( విప్ప) చెట్టు దగ్గర ఇద్దరు కులపెద్దలు పూజలు చేయడంతో గాదె పండుగ మొదలవుతుంది. ఊరి వాళ్లంతా పొలిమేరల్లోని వాగు, వంకల్లో పుణ్యస్నానాలు చేసి, మట్టి కుండల్లో నీళ్లు తీసుకొస్తారు. మొదటి రోజున బాణాలు పట్టుకుని, డోలు వాయిస్తారు. రేల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. దేవర చెట్టుకు పూజలు చేస్తారు. ఆ చెట్టు మీద, ఇద్దరు కులపెద్దల తలమీద కుండలోని నీళ్లు పోస్తారు. ఆ నీళ్లని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు కూడా. అలా చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు. తర్వాత ఆ మట్టి కుండలను అక్కడే వదిలేసి ఇంటికెళ్తారు. కులపెద్దలు మాత్రమే చెట్టు దగ్గర వండుకుని, దేవరచెట్టుకు నైవేద్యం పెట్టిన తర్వాత తింటారు.
మొక్కులు చెల్లించి...
రెండో రోజు అందరూ తాము పండించిన వరి, కందులు, జొన్నలు, మినుములు, సజ్జలు, కొర్రలు, సామలను ఒక్కో బుట్టలో తీసుకొచ్చి దేవరచెట్టు దగ్గర పెడతారు. ‘నీ చల్లని చూపుతోనే వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయి. వచ్చే ఏడు కూడా ఇట్లనే మమ్మల్ని కాపాడు తల్లీ’ అంటూ మొక్కులు చెల్లించుకుంటారు. కుండలతో పాటు దేవుడికి పెట్టిన ఆహారధాన్యాల్లో కొన్నింటిని తీసుకెళ్లి ఇంట్లో ఉంచి పూజలు చేస్తారు. కోళ్లు, మేకలు కోసి దేవర చెట్టు దగ్గర పెడతారు. పూర్వీకులకి నైవేద్యం పెట్టి, సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత వరి ఎన్నులని (కంకులు) గోత్రాల ప్రకారం గుమ్మాలు, ఇంటి వసారాలోని చూరుకు కడతారు.
::: మొబగాపు ఆనంద్‍కుమార్, వెలుగు, భద్రాచలం
