జ్ఞానవాపి మసీదు కేసు: తీర్పు ఈ నెల 17కు వాయిదా

జ్ఞానవాపి మసీదు కేసు: తీర్పు ఈ నెల 17కు వాయిదా

జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో శివలింగం దొరికిన ప్రదేశంలో పూజలకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్​ పై తీర్పును వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నవంబరు 17కు వాయిదా వేసింది. ఈవిషయాన్ని సివిల్​ జడ్జి (సీనియర్​ డివిజన్​) మహేంద్ర పాండే వెల్లడించారని అసిస్టెంట్​ డిస్ట్రిక్ట్​ గవర్నమెంట్​ న్యాయవాది సులభ్​ ప్రకాశ్​ తెలిపారు. ఈ కేసులో అక్టోబరు 27న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును నవంబరు 8 వరకు రిజర్వ్​ చేసింది. అయితే జడ్జి సెలవులో ఉన్నందున తీర్పును నవంబరు 14 (సోమవారానికి) వాయిదా వేశారు. తాజాగా మరోసారి తీర్పును నవంబరు 17కు వాయిదా వేయడం గమనార్హం. 

జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో దొరికిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించడంతో పాటు ఆ ప్రదేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, మసీదు సముదాయాన్ని హిందువులకు అప్పగించాలని పిటిషన్ దారులు కోరారు. శివలింగం వయసును తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసి కోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు గతంలో జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేశారు. దీంట్లో వజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకారం లభించింది. ఇది కాశీ విశ్వనాథుడి శివలింగమే అని హిందూ పక్షం చెబుతోంది. కాగా, ఇది కొలనులోని ఫౌంటేన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో వారణాసి కోర్టు నవంబరు 17న ఏం తీర్పు చెబుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.