జనవరి 25న రథసప్తమి.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు

జనవరి 25న రథసప్తమి.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు

జనవరి 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. బుధవారం ( జనవరి 21 ) జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్, అదనపు వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వైకుంఠ ఏకాద‌శిని విజ‌య‌వంతం చేసిన స్ఫూర్తితో జ‌న‌వ‌రి 25వ తేదిన జ‌ర‌గ‌నున్న‌ ర‌థ స‌ప్త‌మిని కూడా అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు.

జిల్లా అధికారులు, పోలీసు, టీటీడీ అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా కృషి చేయ‌డం వ‌ల్లే శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు విజ‌య‌వంతం చేశామ‌న్నారు. త‌ద్వారా భ‌క్తులు సంతృప్తి ప‌డేలా సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం, మెరుగైన స‌దుపాయాలు క‌ల్పించామ‌ని తెలిపారు.ర‌థ స‌ప్త‌మి రోజున శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బ‌య‌ట ప్రాంతాల్లో నిరంత‌రాయంగా భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. భ‌ద్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని, టీటీడీ భ‌ద్ర‌త విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం స‌మ‌న్వంయంతో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. 

అధికారులు, సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కుల‌తో క‌లిసి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా సేవ‌లు అందించాల‌ని కోరారు. ర‌థ స‌ప్త‌మి రోజున భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా అద‌నంగా 5 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను బ‌ఫ‌ర్ స్టాక్ గా నిల్వ ఉంచుకోవాల‌న్నారు. పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని, ట్రాఫిక్ అంత‌రాయం లేకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. పోలీసులు, టీటీడీ భ‌ద్ర‌త సిబ్బంది స‌మ‌న్వయంతో మాక్ డ్రిల్ నిర్వ‌హించాల‌న్నారు.

మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో వాట‌ర్‌ పైపు లైన్లు, మ‌రుగు దొడ్లు, బ్యారికేడ్లు, త‌దిత‌ర ఏర్పాట్ల‌ను ముంద‌స్తుగా త‌నిఖీ చేసి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పుష్క‌రిణి ప‌రిశీలించి చక్ర‌స్నానం సంద‌ర్భంగా ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ మార్గాల్లో భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. చ‌క్ర‌స్నానం అనంతరం భ‌క్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్ర‌త్యేక గ‌దులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. గ్యాల‌రీల్లోనూ, భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాల‌ని తెలిపారు.

►ALSO READ | తిరుమలలో కల్యాణ వేదికకు విశేష స్పందన.. ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు అయ్యాయంటే...

గ్యాల‌రీల్లో వ్య‌ర్థాలు పేరుకుపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను త‌ర‌లించాల‌ని, గ్యాల‌రీల‌ను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అద‌న‌పు సిబ్బందిని నియ‌మించాల‌ని ఆరోగ్యం విభాగం అధికారుల‌ను ఆదేశించారు. అత్యవ‌స‌ర స‌మ‌యంలో భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు అవ‌స‌ర‌మైన వైద్య సిబ్బంది, పారా మెడిక‌ల్ సిబ్బంది, అంబులెన్స్ ల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు.

భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాల‌ని, ప్ర‌తి వాహ‌నం ముందు వాహ‌న ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేసేలా వ్యాఖ్యాత‌లను నియ‌మించాల‌ని హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ అధికారుల‌ను ఆదేశించారు. సూర్య‌ప్ర‌భ వాహ‌నం ముందు టీటీడీ బాల మందిరం విద్యార్థుల‌తో ఆదిత్య హృద‌యం ప‌ఠ‌నం చేయాల‌ని కోరారు. 

వాహ‌న సేవ‌ల వివ‌రాలు:

  • తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
  • ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
  • ఆర్జిత సేవ‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు
  • కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
  • ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.
  • తిరుపతిలో జ‌న‌వ‌రి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జ‌న‌వ‌రి 24న‌ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.