జ్ఞానవాపి కేసు : పాత తీర్పునే పొడిగించిన సుప్రీం కోర్టు

జ్ఞానవాపి కేసు : పాత తీర్పునే పొడిగించిన సుప్రీం కోర్టు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని సంరక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.శివలింగానికి సుప్రీంకోర్టు కల్పించిన రక్షణ ఈనెల 12వ తేదీతో ముగుస్తున్నందున, భద్రతను పొడగించాలని అడ్వకేట్ విష్ణు శంకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజు చేసుకునేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. 

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడకు ఉన్న గౌరీ, గణేష్, హనుమాన్, నంది విగ్రహాలకు పూజలు చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలో మహిళలు కోర్టుకెక్కారు.  దీనిపై విచారించిన కోర్టు కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన 12 పేజీల నివేదికలో అక్కడ శివలింగ ఆకృతి ఉందని తెలిపింది. అయితే శివలింగం విషయంలో హిందూ వర్గాలు చేస్తున్న వాదనతో ముస్లిం వర్గాలు ఏకీభవించడం లేదు. సర్వేలో కనిపించినట్టు చెబుతున్న వస్తువు ఒక ఫౌంటేన్ అని ముస్లీం వర్గాలు వాదిస్తున్నాయి. ఇది సున్నిత అంశంగా పరిగణించిన కోర్టు.. శివలింగ ఆకృతికి సంరక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.