వేసవిలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్త

వేసవిలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్త

ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్​ ఫీడింగ్​ అప్పుడు ఆడవాళ్లు  ఏ పని  చేసినా, ఎలాంటి ఫుడ్​ తీసుకున్నా ఆ ఎఫెక్ట్​ బిడ్డపై పడుతుంది. అందుకే వేసే అడుగు దగ్గర్నించీ, తీసుకునే ఆహారం వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో​ గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేసవి వేడి వాళ్ల మీద  ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్లు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. వడ దెబ్బ ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది వీళ్లపై. అందుకే వేసవిలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు గైనకాలజిస్ట్​లు. 

ప్రెగ్నెన్సీలో డీహైడ్రేషన్​ చాలా కాంప్లికేషన్స్​కి దారితీస్తుంది. గర్భిణీలకు ఒంట్లో నీటిశాతం తగ్గితే ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రిమెచ్యూర్​​ డెలివరీకి దారితీస్తుంది.  దీనివల్ల బిడ్డ న్యూరల్​ ట్యూబ్స్​ బ్లాక్​ అయ్యే ఛాన్స్​లు ఎక్కువ. కొన్ని సందర్భాల్లో బర్త్​ డిఫెక్ట్స్​కి కూడా కారణం అవుతుంది డీహైడ్రేషన్​. పాలిచ్చే తల్లులు డీహైడ్రేషన్​కి గురైతే పాల ఉత్పత్తి  తగ్గుతుంది. బీపీ, వాస్క్యులర్​ , థ్రోంబోఎంబాలిక్​ డిజార్డర్​​ ఉన్న తల్లులు డీహైడ్రేట్ అయితే  రక్తనాళాల్లో  రక్తం గడ్డకడుతుంది. వీటిన్నింటి నుంచి తప్పించుకోవాలంటే..  ఎలాంటి కేర్​ తీసుకోవాలో చెప్తున్నారు  గైనకాలజిస్ట్​ రజిని. 

కాబోయే అమ్మలు

  ప్రెగ్నెన్సీలో బాడీ టెంపరేచర్​ సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది. వేసవి వేడి దాన్ని  మరింత పెంచుతుంది. అందుకే డీహైడ్రేషన్ బారిన పడకుండా మిగతావాళ్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాలి గర్భిణీలు. అలాగని ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు.  చిన్న చిన్న గుక్కల్లో ఎక్కువసార్లు తాగాలి. తాగే నీళ్లు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండకూడదు. ఏదైనా తినేటప్పుడు నీళ్లు తాగితే.. నీళ్లతో పాటు గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా లోపలికి వెళ్లి సరిపడా తినలేరు. అందుకే ఆహారం సాఫీగా లోపలికి వెళ్లడానికి ఒక అరగ్లాసు నీళ్లు గుటక వేస్తే చాలు. ఆ తర్వాత మళ్లీ దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి. 

  • గర్భిణీలు సరిపడా నీళ్లు తాగకపోతే , మూత్రాశయంలో తయారైన కొద్దిపాటి యూరిన్​ అలాగే ఉండిపోతుంది. దాంతో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాకాకూడదంటే క్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్రీ, కివీ, మామిడి, పైనాపిల్​ లాంటి ప్రొబయోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యూస్​లు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి. ఇవి యూరినరీ ట్రాక్​లో మంచి బ్యాక్టీరియాని పెంచి, ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు. 
  • సాధారణంగా ప్రెగ్నెన్సీలో హార్మోనల్​ ఇంబాలెన్స్​ వల్ల డైజెషన్​ సమస్యలొస్తాయి. దానికి డీహైడ్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తోడైతే జీర్ణాశయ సమస్యలు మరింత పెరుగుతాయి. మొలల సమస్య వెంటాడుతుంది. దానివల్ల హిమోగ్లోబిన్​ తగ్గుతుంది. అందుకే వేసవి కాలం సరిపడా నీళ్లు తాగాలి. 
  • నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దానిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కీరా గర్భిణీలు ఎక్కువ తినాలి. అలాగే సిట్రస్​  ఫ్రూట్ జ్యూస్​లు రోజూ తాగాలి. ఈ టైంలో కారం, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.  నిల్వ పచ్చళ్లు కాకుండా అప్పుడే చేసిన తాజా పచ్చళ్లు తినాలి.
  • మధ్యాహ్నం ఎండలో తిరిగితే శరీరంలోని  నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దాంతో నీరసం వస్తుంది. ఎండవేడికి ఎక్కువగా గురైనప్పుడు.. సన్​ స్ట్రోక్​ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సీజన్​లో గర్భిణీలు ఇల్లు కదలకపోవడం మంచిది. వెళ్లాల్సొస్తే  వదులుగా ఉండే తెలుపు రంగు కాటన్​ డ్రెస్​లు వేసుకోవాలి. మంచినీళ్ల బాటిల్​ వెంట తీసుకెళ్లాలి. ఓఆర్ ఎస్​ జ్యూస్​లు, కొబ్బరి నీళ్లు, గొడుగు తప్పకుండా వెంట పట్టుకెళ్లాలి. 
  • ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ల స్కిన్​ చాలా సెన్సిటివ్​గా​ ఉంటుంది. పొట్ట పెరిగే కొద్దీ వాళ్ల చర్మం సాగి, పగులుతుంటుంది. దురద పెడుతుంది. అందుకే ఎండలోకి వెళ్లేటప్పుడు కచ్చితంగా సన్​స్క్రీన్​ లోషన్​ తీసుకెళ్లాలి. చర్మం పొడిబారకుండా అవసరమైన క్రీమ్స్​ రాయాలి. తలకు టోపీ, టవల్, రుమాలు, స్కార్ఫ్​  వంటివి కట్టుకోవాలి. కళ్లకు చలువ కళ్లద్దాలు పెట్టుకోవాలి. అలాగే స్నానం చేశాక శరీరానికి కొబ్బరి నూనె లైట్​గా పట్టిస్తే బయట ఉండే ఎండ నుంచి రక్షణ దొరుకుతుంది. 

పాలిచ్చే తల్లులు

చిన్నారి కడుపునిండా పాలు తాగాలంటే పాలిచ్చే తల్లులు డీహైడ్రేషన్ బారిన పడకూడదు. కానీ, చాలామంది పెద్దవాళ్లు పిల్లలకు జలుబు చేస్తుందని తల్లిని ఎక్కువ నీళ్లు తాగనివ్వరు. ఈ పొరపాటు వల్ల తల్లి ఒంట్లోని నీటి శాతం తగ్గి పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఎండాకాలంలో టెంపరేచర్​లోని తేడాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఈ కాలం బాడీని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలి. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే ఫ్రూట్​ జ్యూస్​లు రెగ్యులర్​గా తీసుకోవాలి. దాంతో పాటు డీహైడ్రేషన్​కి దారితీసే ఈ పొరపాట్లు చేయకూడదు.

  • డెలివరీ తర్వాత ఆడవాళ్లకి బ్రెస్ట్​ సైజ్​ పెరగడం సహజం. అలాంటప్పుడు సపోర్టింగ్​గా​ బ్రాలు వాడకపోతే ఛాతి  భాగం జారినట్టు అనిపిస్తుంది. దాంతో చాలామంది డెలివరీ తర్వాత బ్రాలు వేసుకుంటారు. కానీ, వేసవిలో మరీ టైట్​ బ్రాలు వేసుకోవడం వల్ల చెమట ఎక్కువ పడుతుంది. దానివల్ల ఫంగల్​ ఇన్ఫెక్షన్స్​ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పాలు పట్టిన ప్రతిసారీ రొమ్ము క్లీన్​ చేసుకోవాలి. చెమట పీల్చుకునే కాటన్​ బ్రాలే వేసుకోవాలి. తప్పనిసరిగా ఈ కాలం రెండు పూటలా స్నానం చేయాలి. 
  • డెలివరీ తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయి. డీహైడ్రేషన్​ వల్ల  అవి మరింత పెరుగుతాయి. అందుకే వేసవిలో పాలిచ్చే తల్లులు తప్పకుండా నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. అలాగని వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి చల్లటి నీళ్లు తాగొద్దు. దానివల్ల పిల్లలకి జలుబు చేసే అవకాశం ఉంది. 
  • వేసవిలో సరిపడా నీళ్లు తాగకపోతే యూరినరీ ట్రాక్​ ఇన్ఫెక్షన్స్​ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఒంట్లో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు వాటర్​ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు తినాలి. అలాగే వేసవిలో పాలిచ్చే తల్లులు కాఫీలు తాగొద్దు. వీటిలోని కెఫిన్​ని పిల్లలు అరిగించుకోలేరు.