ఓవైపు AI.. మరో వైపు ట్రంప్ పిడుగు.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం

ఓవైపు AI.. మరో వైపు ట్రంప్ పిడుగు.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం
  • రాష్ట్రంలో ఏటా కాలేజీల నుంచి వస్తున్న లక్ష మంది ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్స్​
  • వీరిలో సగం మంది ఇతర దేశాల్లో, అదీ అమెరికాలో పనిచేసేందుకు మొగ్గు
  • ఏఐ రాకతో ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు పెడ్తున్న ఐటీ కంపెనీలు
  • తాజాగా హెచ్1 బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజుతో డాలర్​​ డ్రీమ్స్​​ ఆవిరి

హైదరాబాద్, వెలుగు: పట్టుమని 25 ఏండ్లు నిండకముందే లక్షల ప్యాకేజీతో కొలువు.. అవకాశం వస్తే అమెరికాలో ఉద్యోగం.. డాలర్లలో సంపాదన.. అదీకుదరకపోతే హైదరాబాద్​లోనో, బెంగుళూరులోనే ఆరంకెల జీతం.. చీకూచింతాలేని జీవితం.. ఇదంతా ఐటీ రంగానికి సంబంధించిన గతం!! ఇప్పుడు ఈ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వల్ల ఉద్యోగాల్లో కోత పడుతుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తీసుకుంటున్న నిర్ణయాలు ఐటీ ఉద్యోగులను భయపెడ్తున్నాయి.  ఆవైపు వెళ్లాలనుకునేవాళ్ల ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలకు కీలకమైన హెచ్‌‌‌‌1బీ వీసాల ఫీజులను ఇటీవల ట్రంప్​ సర్కారు భారీగా పెంచడంతో డాలర్​ డ్రీమ్స్​​పై పిడుగు పడినట్లయింది. దీనికితోడు ఐటీ ఎగుమతులపైనా టారిఫ్​లు పెంచుతారనే వార్తలు మరింత కుదిపేస్తున్నాయి.

ఏటా లక్ష మంది ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్స్​
రాష్ట్రంలో ప్రస్తుతం 9.72 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా ఇంజినీరింగ్ కాలేజీల్లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి సుమారు లక్ష మంది బయటకు వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. దాదాపు సగం మంది మనదేశంలో పనిచేసేందుకు మొగ్గుచూపుతుండగా.. మరోసగం మంది ఇతర దేశాల్లో, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారు. కానీ, కొద్దిరోజులుగా మార్కెట్​లో ఐటీ ఉద్యోగులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ కంపెనీలు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ ఐటీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. చాట్​ జీపీటీ వంటి ఏఐ టూల్స్ రావడంతో చాలా పనులు సులభంగా, వేగంగా పూర్తవుతున్నాయి. ఒకప్పుడు మనుషులు చేసే పనులన్నీ ఏఐ చేస్తుండడంతో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2030 నాటికి ఐటీలో 85 మిలియన్ జాబ్స్ గల్లంతవుతాయని ఓ సర్వే స్పష్టంచేసింది. కానీ, అదేస్థాయిలో కొత్త ఎంప్లాయీమెంట్ జనరేట్ అవుతుందని కూడా ప్రకటించింది. 

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసా ఆంక్షలతో ఇబ్బందే..!
అమెరికా ప్రభుత్వం హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. ఇది కొత్తగా అమెరికా కంపెనీల్లో జాయిన్​అయ్యే వారికే అని క్లారిటీ ఇవ్వడం ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి ఊరట కలిగించే అంశం. గతంలో హెచ్​1బీ వీసాపై ఐదు నుంచి ఆరు వేల డాలర్ల ఫీజు ఉండగా.. ఇది లక్ష డాలర్లకు(దాదాపు రూ.90 లక్షల) చేరుకోవడంతో ఇకపై అమెరికా కంపెనీల్లో పనిచేయాలనుకునే వారికి అడ్డంకిగా మారింది. ఇండియాలో తక్కువ జీతాలకు పనిచేసే నిపుణులు దొరుకుతున్నందునే అమెరికా కంపెనీలు వారిని ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఐటీ నిపుణులకు ఏడాదికి రూ. 90 లక్షలలోపే జీతం ఉంటుంది. అలాంటిది అంత పెద్దమొత్తంలో ఫీజులు చెల్లించి ఇండియా నుంచి ఐటీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు మొగ్గుచూపకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండియా నుంచే ఎక్కువ..!
భారత ఐటీ కంపెనీలకు అమెరికానే ప్రధాన మార్కెట్. కానీ ‘అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే’ అనే నినాదం, డేటా భద్రత వంటి కారణాలతో భారత కంపెనీలకు కొత్త ప్రాజెక్టులను యూఎస్ సర్కార్ కొంతకాలంగా తగ్గిస్తున్నది. అమెరికా హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసాల విషయంలో భారత్ చాలా కాలంగా అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏటా జారీ చేసే వీసాల్లో 70% కంటే ఎక్కువ వీసాలు భారతీయ నిపుణులకే లభిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన మొత్తం హెచ్1బీ వీసాలలో 71%  మంది ఇండియన్స్ ఉండగా, చైనా 11.7% తో రెండో స్థానంలో ఉంది.

ఈ లెక్కన ఏటా హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసాల సంఖ్య 85వేలు. ఈ సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ, దరఖాస్తులు భారీగా వస్తున్నాయి.  2023–24 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఐటీ ఎగుమతులు 10లక్షల కోట్ల  నుంచి 12లక్షల కోట్ల మధ్య(మొత్తం ఐటీ ఎగుమతుల్లో దాదాపు 65% వరకు) ఉన్నాయి. ఎగుమతుల మీద కూడా టారీఫ్​ల పెంపునకు ట్రంప్​ సర్కారు ఆలోచన చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే చాలా మంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. 

జీసీసీలకు ప్రయార్టీ
అమెరికా ఆంక్షల నేపథ్యంలో దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు)కు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని ఐటీ నిపుణులు చెప్తున్నారు. బడా విదేశీ కంపెనీలు తమ ఐటీ ప్రాజెక్టులను వేరే దేశాల్లోని ఉద్యోగులకు ఇవ్వకుండా, తమ సొంత సంస్థలైన జీసీసీల ద్వారా చేయించుకుంటున్నాయి. ఇక్కడ వీరికి టాలెంటెడ్ ఇంజినీర్లు తక్కువ ఖర్చుతో దొరుకుతారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి సిటీలలో ఇప్పటికే చాలా జీసీసీలు ఉన్నాయి. ఈ కొత్త పరిస్థితి వల్ల భారతీయ ఐటీ నిపుణులకు మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం పెరిగింది. ఇది ఒక విధంగా ఐటీ ఉద్యోగులకు ఊరట కలిగించే అంశమని చెప్తున్నారు. 

అమెరికాకూ నష్టమే
అమెరికా పెట్టిన ఆంక్షలతో మనతో పాటు ఆ దేశానికి కూడా నష్టమే. మంచి టాలెంట్​ ఉన్న నిపుణులు ఆ దేశానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇతర దేశాలకు వాళ్లంతా తరలిపోయే ప్రమాదం ఉంది. ఏఐతో ఎన్ని  ఉద్యోగాలు పోతున్నాయో.. అంతే స్థాయిలో లాంగ్ టర్మ్​లో భారీగానే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు, ప్రభుత్వాలు నాన్ ఐటీ ప్రాజెక్టులపైనా ఫోకస్ పెంచాలి.

 
సందీప్ మక్తాల, ఐటీ ఎక్స్ పర్ట్