- 45 అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో సోదాలు చేసిన హెచ్‌ఫాస్ట్ టాస్క్‌ఫోర్స్
- కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీల నుంచి
- క్వాలిటీ లేని పనీర్ సరఫరా ఫ్రెష్ పనీర్, ప్రీమియం పన్నీర్ పేరుతో లేబుల్స్ వేసి అమ్మకాలు
- మలై పనీర్ అంటూ చీజ్ అనలాగ్ పనీర్‌ను విక్రయిస్తున్న వ్యాపారులు
- క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ అమ్మితే క్రిమినల్
- కేసులు పెడ్తం: హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
బేగంబజార్, వెలుగు: హైదరాబాద్ సిటీలో భారీగా కల్తీ పనీర్‌ను హెచ్ ఫాస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిటీలోని బేగంబజార్, కాటేదాన్ తదితర ప్రాంతాల్లోని 45 రిటైల్ దుకాణాలు, 8 తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి, సుమారు 825 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వెజిటేబుల్ ఫ్యాట్స్ (వనస్పతి కొవ్వులు), పాలు కాని ఇతర పదార్థాలతో చీజ్ అనలాగ్‌ను తయారు చేస్తున్నారని, పనీర్‌లో పిండి పదార్థం(స్టార్చ్), ఎక్కువ నీళ్లు, నాణ్యత లేని లేదా సింథటిక్ పాలు, నాన్-ఫుడ్- గ్రేడ్ కెమికల్స్ వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా బేగంబజార్‌లోని హెచ్-ఫాస్ట్ ఆఫీసులో పనీర్ విక్రేతలు, తయారీదారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడారు. ‘‘పనీర్‌లో చాలా రకాలుంటాయి.
మలై పనీర్, చీజ్ అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలకు అనుమతి ఉంది. అయినా ఈ రెండింటి మధ్య పోషక విలువల్లో తేడా ఉంటుంది. మలై పనీర్‌లో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. చీజ్ అనలాగ్ పనీర్‌లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. చీజ్ అనలాగ్ ఉత్పత్తులను సాధారణంగా కూరగాయల కొవ్వు పదార్థాలు, పామాయిల్ తదితర పదార్థాలతో తయారు చేస్తారు. వీటిని పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్ తదితర ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ తయారీలో వాడతారు. అయితే, పలువురు వ్యాపారులు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చీజ్ అనలాగ్ పనీర్‌ను తీసుకువస్తున్నారు. వాటిపై సొంత బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి అమ్ముతున్నారు”అని ఆయన తెలిపారు.
ఎక్స్‌పైరీ డేట్‌ను మారుస్తున్నరు..
తక్కువ ధరకు దొరికే చీజ్ అనలాగ్ పనీర్‌ను ఎక్కువ ధర కలిగిన మలై పనీర్‌గా చూపిస్తూ పలువురు వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ‘‘చాలామంది తయారీదారులు ఈ పనీర్లపై తయారీ తేదీలను తారుమారు చేసి, వాస్తవ తేదీల కంటే రెండ్రోజులు ముందుగా ముద్రించి అమ్ముతున్నారు. ఎక్స్‌పైరీ అయినా కూడా తేదీలను మార్చడం ద్వారా వినియోగదారులు వాటిని కొని, తినడంతో ఫుడ్ ఫాయిజనింగ్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పనీర్ ప్యాక్‌పై ఎక్స్‌పైరీ డేట్, ఫ్యాట్ శాతం, ప్రొటీన్ శాతం, ధర వంటి వివరాలు సరిగా ముద్రించడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో చీజ్ అనలాగ్ పన్నీర్ ధర రూ.300 ఉండగా, మలై పనీర్ కిలో ధర రూ.450 వరకు ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ చీజ్ అనలాగ్ పనీర్‌ను మలై పనీర్ అని చెప్పి అమ్ముతున్నారు”అని ఆయన వెల్లడించారు.
క్రిమినల్ కేసులు పెడ్తం..
కొందరు చీజ్ అనలాగ్ తయారీదారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్ లేకుండానే పనీర్ తయారు చేస్తున్నారని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ఇక నుంచి మలై పనీర్, చీజ్ అనలాగ్ పనీర్ వంటి ఉత్పత్తులను తప్పనిసరిగా వేర్వేరు లేబుళ్లతో విక్రయించాలని సూచించారు. ప్రతి ప్రొడక్ట్‌పై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్, ఫ్యాట్ శాతం, ప్రొటీన్ శాతం, ధర వంటి పూర్తి వివరాలను స్పష్టంగా ముద్రించాలని ఆదేశించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా తప్పుడు బ్రాండింగ్, వినియోగదారులను మోసం చేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యాపారులు, తయారీదారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఆహార ఉత్పత్తులను లైసెన్స్ ఉన్న షాపుల వద్దే కొనాలి. బ్రాండింగ్ లేబుల్స్, ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
