- గ్రామీణ రహదారుల అనుసంధాన స్కీంలపై కీలక సమావేశం
- తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా 26,000 కి.మీలు పూర్తి చేయాలని లక్ష్యం
- రాష్ట్ర నుంచి హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ఉన్నతాధికారులు
న్యూఢిల్లీ, వెలుగు: చివరి మైలు రాయిదాకా రోడ్డు కనెక్టివిటీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అలాగే నాణ్యత పర్యవేక్షణను బలోపేతం చేయాలని, ఈ–మార్గ్ ప్లాట్‌పామ్‌ను సార్వత్రికంగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్ వై), తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల రహదారి అనుసంధాన ప్రాజెక్ట్‌పై ఢిల్లీలో గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ సంస్థల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ హాజరై, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, పురోగతిని వివరించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాలు, అమలు స్థితిని వివరించారు.
12 రాష్ట్రాల్లో 26,000 కి.మీల లక్ష్యం...
2026–27 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 26,000 కి.మీలకు పైగా గ్రామీణ రహదారులను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.18,907 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పురోగతిని ఈ సమావేశంలో కేంద్రం సమీక్షించింది. ప్రధానంగా వెనకబడిన ప్రాంతాల్లో గ్రామీణ కనెక్టివిటీని పూర్తిస్థాయిలో తీసుకురావడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ రోడ్ల డీపీఆర్‌లు వేగవంతం చేయాలని, అమలులో ఉన్న అడ్డంకులను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న కనెక్టివిటీ ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయాలని రోహిత్ కన్సల్ రాష్ట్రాలను కోరారు. మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా గ్రామీణ రహదారి ఆస్తుల నాణ్యత, దీర్ఘకాలిక సుస్థిరతపై ఫోకస్
పెట్టాలన్నారు.
