
టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలు దూసుకుపోతుంటే..భారత్ను మాత్రం మూఢ నమ్మకాలు ఇంకా వదలడం లేదు. ఫలానా పూజలు చేస్తేనో...ఫలానా ప్రార్థనలు జరిపిస్తేనో..మంచి జరుగుతుందని చెబితే ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బాబాలు దారుణాలకు పాల్పడుతున్నారు. మరి కొందరు బాబాలు యువతులు, మహిళలను టార్గెట్ చేసి దుర్మార్గపు పనులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఓ దొంగ బాబా బాలిక పట్ల నీచంగా వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని ఓ దర్గాకు చైర్మన్‌గా ఉన్న షా గులాం నక్షాబంద్ హఫీజ్ పాషా బాబా హైదరాబాద్ మలక్‌పేటలో నివాసముంటున్నాడు. అయితే లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బాలిక అనారోగ్యానికి గురైంది. గుండె, శ్వాస, మెదడు సమస్యలతో బాధపడుతోంది. ఆస్పత్రులకు వెళ్లినా... తగ్గలేదు. దీంతో తనకు తెలిసిన వారు రెహ్మతాబాద్ షరీఫ్ దర్గా బాబా వద్దకు వెళ్తే ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. దీంతో బాలికను కుటుంబ సభ్యులు బాబా దగ్గరకు తీసుకొచ్చారు. దర్గాలో బాధితురాలితో హఫీజ్ పాషా బాబా ప్రార్థనలు చేయించారు. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబం బాబాను ఇంటికి రావాలని..ఇంట్లోనూ ప్రార్థనలు చేయాలని ఆహ్వానించింది. దీంతో లంగర్‌హౌస్ ఎండి లైన్స్‌లోని బాధితురాలి ఇంటికి వచ్చిన దొంగ బాబా బాలిక ప్రార్థనల పేరుతో ఆమె ప్రైవేట్ పార్ట్‌ను టచ్ చేశాడు.
బాబా ప్రవర్తనను బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు బాబాను నిలదీశారు. అయితే బాలిక మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పి దొంగ బాబా తప్పించుకున్నాడు. ఆ తర్వాత మరోసారి ప్రార్థనల పేరుతో మళ్లీ బాబా అదే పని చేశాడు. అయితే ప్రార్థనలకు ముందే కుటుంబ సభ్యులు రూమ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని గమనించని నకిలీ బాబా.. బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది మొత్తం రికార్డయింది. సీసీ పుటేజీని చూపించి బాలిక తల్లిండ్రులు నిలదీయడంతో.. బాలికను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ నెల 10 న వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. అయితే అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..దొంగ బాబాను అరెస్టు చేశారు. అయితే బాబా గురించి పోలీసులు విచారణ చేయగా...విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నిందితుడు ఇప్పటి వరకు ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడని..అలాగే 13 మందిని వివాహం చేసుకుంటానని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.