హఫీజ్ సయీద్‌‌ను అప్పగించాల్సిందే.. ఇజ్రాయెల్‌‌లోని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్

హఫీజ్ సయీద్‌‌ను అప్పగించాల్సిందే.. ఇజ్రాయెల్‌‌లోని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్

జెరూసలేం: ఇజ్రాయెల్‌‌లోని భారత రాయబారి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌ ఇంకా ముగియలేదని.. ఇది కేవలం విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేగాక..26/11 దాడి సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా అప్పగించినట్లే.. ఇస్లామాబాద్ కూడా కరుడుగట్టిన టెర్రరిస్టులైన హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీలను అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు.

సోమవారం (May 19) ఆయన ఇజ్రాయెల్ కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "పాకిస్తాన్‌‌లోని ఉగ్రవాద గ్రూపులపైన మాత్రమే భారత్ ఆపరేషన్ సిందూర్‌‌ చేపట్టింది. పహల్గాంలో టెర్రరిస్టులు మతం అడిగి మరీ 26 మంది టూరిస్టులను చంపారు. దీనికి ప్రతీకారంగానే భారత్ ఉగ్రవాద గ్రూపులు, వారి మౌలిక సదుపాయాలపై ఆపరేషన్ నిర్వహించింది.

కానీ, ఆపరేషన్ సిందూర్‌‌ కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం.. భారత సైనిక స్థావరాలపై దాడి చేసింది. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నది. కానీ, ఆపరేషన్ సిందూర్ ప్రస్తుతానికి నిలిపివేశాం అంతే. అది ఇంకా ముగియలేదు. టెర్రరిజంపై భారత్ పోరాటం కొనసాగుతుంది. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా అంతం చేయాలి.

వారి మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి" అని జేపీ సింగ్ పేర్కొన్నారు. మే 10 తెల్లవారుజామున నూర్ ఖాన్ స్థావరంపై భారత్ చేసిన దాడిని గేమ్ ఛేంజర్‌‌గా అభివర్ణించిన ఆయన..ఇది పాకిస్తాన్‌‌లో భయాందోళనలు సృష్టించిందన్నారు. పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ కోసం భారత్ ను సంప్రదించిందని తెలిపారు. ముంబై దాడుల వెనుక ఉన్న లష్కరే తోయిబా లీడర్లు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టెర్రరిస్టులను భారత్ కు అమెరికా అప్పగించగలిగినప్పుడు, పాకిస్తాన్ ఎందుకు అప్పగించదు? అని ప్రశ్నించారు. హఫీజ్ సయీద్, లఖ్వీ, సాజిద్ మీర్‌‌లను పాక్ అప్పగిస్తేనే కథ ముగిసిపోతుందని జేపీ సింగ్ పేర్కొన్నారు.