
సిద్దిపేట రూరల్, చేర్యాల, కొమురవెల్లి, వెలుగు: వడగళ్ల వాన రైతులను వెంటాడుతోంది. వరుసగా మూడోరోజు కూడా సిద్దిపేట జిల్లాలోని పలు చోట్ల వడగళ్ల వాన పడింది. చేర్యాల మండలంలోని ఆకునూరు, చేర్యాల, రాంపురం, మద్దూరు మండలంలోని భైరాన్ పల్లి, వల్లంపట్ల, గాగిళ్లాపురం, నర్సాయపల్లి, రెబర్తి, లద్దునూరు, మద్దూరు మండల కేంద్రం, లక్కపల్లి , సిద్దిపేట రూరల్ మండలం చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, పెద్దలింగారెడ్డిపల్లి , నారాయణరావుపేట మండలం వ్యాప్తంగా సోమవారం కురిసిన వానకు తీవ్ర నష్టం జరిగింది. కోతకు వచ్చిన వడ్లు పొలంలోనే రాలపోయాయి. పలుచోట్ల ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వరితో పాటు, మామిడి, మిర్చి ఇతర కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో చేర్యాల మండల కేంద్రంలోని శ్రీరామ్ రాజు ఇంటి రేకులు ఎగిరిపోయాయి.
పంటలు పరిశీలించిన కలెక్టర్
వడగళ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. సోమవారం చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, కొమురవెల్లి మండలం ఐనాపూర్, పోసాన్పల్లి గ్రామాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత పంటనష్టం జరిగిందో సర్వే చేసి మూడు రోజుల్లో వివరాలు అందజేయాలని ఏడీఏ రాధికను ఆదేశించారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జడ్పీటీసీ సిద్దప్ప, ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్ రెడ్డి, సర్పంచ్‌లు రమణరెడ్డి, కత్తుల కృష్ణవేణి, నూనె వెంకటేశం, ఎంపీటీసీ బాలరాజు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.