రాష్ట్రాన్ని వణికిస్తున్న వడగండ్ల వానలు

రాష్ట్రాన్ని వణికిస్తున్న వడగండ్ల వానలు
  • కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు 
  • కొన్నిచోట్ల కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు 
  • చెట్టు విరిగిపడి ఒకరు, పిడుగు పడి మరొకరు మృతి

నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రాన్ని వడగండ్ల వానలు వణికిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం మరోసారి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వడగండ్ల వర్షానికి ఉత్తర తెలంగాణ అతలాకుతలమైంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. కొన్నిచోట్ల టెన్నిస్ ​బాల్​​సైజులో పడిన వడగండ్ల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో వడ్లన్నీ రాలిపోయాయి. ఇప్పటికే కోసి కొనుగోలు సెంటర్లు, రోడ్ల వెంట ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. చాలా చోట్ల వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 


గాలిదుమారం కారణంగా అనేక ప్రాంతాల్లో పెద్ద చెట్లు, కరెంట్​స్తంభాలు విరిగిపడ్డాయి. మెదక్​ జిల్లాలో చెట్టు విరిగిపడి మహిళ చనిపోగా, నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం భాగీర్తిపల్లికి చెందిన నీళ్ల పద్మ (38), అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ బైక్ పై రామాయంపేట నుంచి భాగీర్తిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి వాళ్ల మీద పడింది. తీవ్రంగా గాయపడిన పద్మ స్పాట్ లోనే  చనిపోగా, శ్రీకాంత్ కు గాయాలయ్యాయి. నిర్మల్​జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ శివారులో మేకలు కాస్తున్న పాతకుంట మోహన్ (21)..  వర్షం రావడంతో ఓ చెట్టు కిందికి వెళ్లి నిలబడ్డాడు. ఆ టైమ్ లో పిడుగు పడడంతో స్పాట్​లోనే చనిపోయాడు. 

 

  • వడగండ్ల వానకు కామారెడ్డి జిల్లాలో చేన్లు మంచు దుప్పటిలా మారాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లింగంపేట, రాజంపేట, భిక్కనూరు, దోమకొండ,  ఎల్లారెడ్డి, బాన్స్​వాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్, సదాశివనగర్, కామారెడ్డి మండలాల్లో పెద్ద సైజు రాళ్లు పడడంతో నష్టం ఎక్కువగా ఉంది. ఒక్క లింగంపేట మండలంలోనే ఏకంగా 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కొనుగోలు సెంటర్లలో వందలాది క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. ఎల్లారెడ్డిపేట, లింగంపేట మండలాల్లో పదుల సంఖ్యలో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక గ్రామాల్లో కరెంట్​సరఫరా నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వరి పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్ల పై ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి.  

 

  • మెదక్​జిల్లాలో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. మెదక్ మార్కెట్​లో, పాపన్నపేట, కౌడిపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు తడిసిపోయాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గంటకు పైగా వర్షం పడింది. కొండాపూర్, సదాశివపేట, కంది, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పంట నష్టం జరిగింది. కోహీర్ నుంచి బిలాల్​పూర్​మీదుగా తాండూర్ రోడ్డుపై కరెంట్ స్తంభాలు పడడంతో వెహికల్స్​ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కంగ్టి మండలం జమ్గి(కే) గ్రామంలో గౌతమి అనే మహిళ పిడుగు ధాటికి స్పృహ తప్పి పడిపోగా, బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో టెన్నిస్ బాల్ సైజులో వడగండ్లు పడ్డాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. 

 

  • ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, తలమడుగు, తాంసి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. కోసి ఆరబెట్టుకున్న మక్కలు, జొన్నలు తడిసిపోయాయి. తలమడుగు మండలం నందిగామ గ్రామం ఎటుచూసినా వడగండ్లతో కశ్మీర్ ను తలపించింది. ఆసిఫాబాద్ జిల్లాలో వరి, మక్క పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కాగజ్ నగర్ బురదగుడాలో ఇంటి గోడ కూలి 8 మేకలు చనిపోయాయి. 

 

  • కరీంనగర్ జిల్లాను మూడ్రోజులుగా వర్షం వదలడం లేదు. మంగళవారం కూడా కరీంనగర్‌ సిటీతో పాటు చొప్పదండి, రామడుగు మండలాల్లో భారీ వర్షం పడింది. జగిత్యా ల జిల్లా రాయికల్, సారంగపూర్ మండలల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వానల వల్ల కొనుగోలు సెంటర్లలో  ధాన్యం తడిసింది. ఈ జిల్లాలో ఇప్పటికే  42,774 ఎకరాల్లో వరి, మామిడి, మక్క, నువ్వుల పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. మళ్లీ కురిసిన వానలతో ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లాలో పడ్డ రాళ్లవానకు కొనరావుపేట, ఎల్లారెడ్డి పేట, చందుర్తి, వేములవాడ, వీర్నపల్లి, గంబీరావుపేట మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 

 

  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, కాజీపేట మండలాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. జనగామ జిల్లాలో ఈదురుగాలులతో పాటు వడగండ్లు పడ్డాయి. ఇప్పటివరకు ఈ జిల్లాలో 40 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని ఆఫీసర్లు ప్రకటించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో పిడుగు పడి 10 ఆవులు, ఎద్దులు చనిపోయాయి. 

 

  • యాదాద్రి జిల్లాలో భువనగిరి, ఆలేరు, రాజాపేట, యాదగిరి గుట్ట సహ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిసిపోయాయి.