సిద్దిపేటలో వడగండ్ల వర్షం బీభత్సం

సిద్దిపేటలో వడగండ్ల వర్షం బీభత్సం
  • వందల సంఖ్యలో విరిగిన చెట్లు
  • కూలిన విద్యుత్ స్తంభాలు భారీగా ఆస్తి నష్టం

సిద్దిపేట, సిద్దిపేట రూరల్, టౌన్, వెలుగు: సిద్దిపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. వందకు పైగా చెట్లు విరిగిపోగా, 30కి పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పట్టణంలోని నాసరపురా కాలనీలో మూడు ఇండ్లు, సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఒక రేకుల షెడ్డు కూలిపోయాయి.

చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిన్నకోడూరు మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో 400 బస్తాల సన్ ప్లవర్ తడిచిపోయింది. నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం చేకూరింది. జిల్లాలో ఆకస్మికంగా కురిసిన వడగళ్ల వానపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని, పడిపోయిన చెట్లను తొలగించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఎమ్మెల్యే హరీశ్ రావు టెలికాన్ఫరెన్స్

ఢిల్లీలో ఉన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు పలు సూచనలను చేశారు. పట్టణంలో కూలిన చెట్లను, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని, వరద నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కూలిన ఇండ్లకు, నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే పదివేల నష్టపరిహారం అందించాలన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వెంటనే సహాయ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.