
దుబ్బాక, మెదక్ (రేగోడ్), పాపన్నపేట, సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట రూరల్, దుబ్బాక, పాపన్నపేట, రేగోడ్ మండలాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈదురుగాలులతో కూడిన వానకు దుబ్బాక మండలంలోని చెల్లాపూర్, మల్లాయపల్లి, పద్మశాలి గడ్డ, బల్వంతాపూర్, రాజక్కపేట, గంభీర్పూర్, దుబ్బాక గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నది. బల్వంతాపూర్ గ్రామంలో మూడు ఇండ్ల రేకులు ఎగిరిపోగా, విద్యుత్ స్తంభాలు, వైర్లు నేలకొరిగాయి. రాజక్కపేట గ్రామంలో రెండు ఇండ్లు కూలిపోయాయి. వడగళ్ల వానతో మండలంలో సుమారుగా 2,290 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్వవసాయ అధికారులు అంచనా వేశారు.
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని సీతారాంపల్లి, చింతమడక, మాచాపూర్ గ్రామాలలో 600 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో మామిడి, 5 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నదని ఏవో పరశురాం రెడ్డి, హార్టికల్చర్ అధికారి బాలాజీ తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా,అమ్రీయా తండాల్లో శుక్రవారం తెల్లవారు జామున ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 15 కరెంట్ స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫ్రార్మర్స్, చెట్లు విరిగిపోయాయి. సోమ్లా తండాకు చెందిన కోలవత్ రమేశ్, బీమ్లా, బాబు, సర్తార్, బానవత్ రాందాస్ అమ్రీయా తండాకు చెందిన గంగ్యనాయక్ ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. రేగోడ్ మండలం జగిర్యాలలో బోయిని బక్కయ్యకు చెందిన కొట్టంపై పిడుగు పడడంతో రెండు ఎద్దులు, ఒక లేగ దూడ చనిపోయాయి. దుబ్బాక పట్టణానికి చెందిన మల్లుగారి దినేశ్ రెడ్డి పాడి బర్రె కూడా పిడుగు పాటుకు గురై చనిపోయింది.
పంటలను పరిశీలించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మండలంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. చేతికొచ్చే సమయంలో పంట నేలపాలైందని, తమను ఆదుకోవాలని రైతులు ఎంపీకి మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎవరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.