
సామాన్యులు మొదలు సెలెబ్రిటీల వరకు
లేటెస్ట్ ట్రెండ్ ఆనియన్ జ్యూస్
‘ఈమధ్య జుట్టు బాగా రాలిపోతోంది’ అని ఎవరైనా అనడం ఆలస్యం.. ‘ఆనియన్ జ్యూస్ వాడు’ అని ఒక సజెషన్ ఇస్తున్నారు చాలామంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ‘ఆనియన్ జ్యూస్’ మెథడ్ ట్రెండ్ అవుతోంది. జుట్టు రాలకుండా ఆపుతుందని, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుందని దీన్ని వాడుతున్నారు. కానీ, ఇది పనిచేస్తుందని కొందరు.. పని చేయదని ఇంకొందరు అంటున్నారు. ఆనియన్ జ్యూస్ వల్ల ఎవరికైనా జుట్టు రాలడం తగ్గితే, దానికి మరెన్నో ఫ్యాక్టర్స్ హెల్ప్ అయ్యుంటాయి. ఒకవేళ తగ్గకపోయినా, దానికీ కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ‘‘రిజల్ట్ ఏదైతేనేం.. పెద్దగా ఖర్చు లేకుండా, సింపుల్‌గా చేసుకోగలిగే ఆనియన్ జ్యూస్ వాడితే పోయేదేముంది. ఒకసారి ట్రై చేద్దాం’’ అనుకునేవాళ్లే ఎక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్‌లో సినీ తారలు కూడా చేరారు. హీరోయిన్ తమన్నా భాటియా, మలైకా అరోరా, బిపాషా బసు లాంటి వాళ్లు ఆనియన్ జ్యూస్ బాగానే పనిచేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇలా పనిచేస్తుంది
ఆనియన్ జ్యూస్‌లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది.
జుట్టు పలుచగా కానీయదు. జుట్టు కుదుళ్లు పెరిగేలా చేస్తుంది.
చుండ్రు, ఇతర సమస్యలకు కారణమైన పోషక లోపాన్ని కొంత తగ్గిస్తుంది.
దీనిలో ఉండే క్యాటలేజ్ అనే ఎంజైమ్ వెంట్రుకలు పెరిగేందుకు సాయపడుతుంది.
కరోనా సోకిన వాళ్లు చాలామంది హెల్త్ పరంగా చాలా వీక్ అవుతున్నారు. కరోనా తగ్గిన తర్వాత కూడా బలహీనంగానే ఉంటున్నారు. దీని వల్ల చాలా మందికి, మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. కరోనా సోకి, తగ్గిన మలైకాతోపాటు, తమన్నా, బిపాషా వంటి స్టార్స్ కూడా దీనికి సొల్యూషన్‌గా ఆనియన్ జ్యూస్‌ను వాడుతున్నారట. అందుకే ఇది బాగానే పనిచేస్తుంది అని చెప్తున్నారు. హెయిర్ ఫాలింగ్ సమస్య ఉన్న వాళ్లు ఒకసారి దీన్ని ట్రై చేస్తే బాగుంటుందని అంటున్నారు కూడా ఈ స్టార్స్. ‘ఇంతకుముందు చాలాకాలం పాటు ఆనియన్ జ్యూస్ వాడాను. ఈమధ్య కరోనా ప్రభావంతో జుట్టు రాలే సమస్య బాగా పెరిగింది. దీంతో మళ్లీ ఆనియన్ జ్యూస్ వాడటం స్టార్ట్ చేశాను. దీనివల్ల ప్రాబ్లమ్ చాలావరకు తగ్గింది. ఇది చాలా సింపుల్’ అంటూ మలైకా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది ఎలా వాడాలో కూడా సూచించింది. ఆమెతోపాటు తమన్నా భాటియా, బిపాషా బసు వంటి స్టార్స్ కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యామని చెప్తున్నారు. ఆనియన్ జ్యూస్ తలకు రాసుకుంటే జుట్టు రాలడం, డ్యామేజ్ కావడం వంటివి తగ్గుతాయంటున్నారు. దీన్ని ఎలా వాడాలో కూడా చెప్తూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేశారు.
ఎలా తయారు చేయాలంటే
స్టార్స్ సలహా ప్రకారం ఆనియన్ జ్యూస్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఒకటి లేదా రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని మిక్సీ పట్టి, మెత్తటి పేస్ట్‌లాగా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక మస్లిన్ (పలుచని) క్లాత్ లేదా కాటన్ క్లాత్‌లోకి తీసుకుని, గిన్నెలో రసం పిండాలి. దీంతో ఉల్లి మిశ్రమంలోని అసలైన సారం గిన్నెలోకి చేరుతుంది. దీన్ని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసేటప్పుడు ఆ కంటైనర్‌లో తడి ఉండకూడదు. అయితే, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసుకుని, వాడుకుంటే మరింత బాగా పనిచేస్తుంది ఈజ్యూస్.
ఎలా వాడాలి?
పొడిగా ఉన్న కాటన్ తీసుకుని, ఆనియన్ జ్యూస్‌లో ముంచి పొడి జుట్టుమీద సున్నితంగా మాడుకు తగిలేలా రాయాలి. తల అంతా బాగా పట్టించాలి. అరగంట నుంచి నలభై అయిదు నిమిషాలపాటు అలాగే ఉంచి, తర్వాత హెర్బల్ షాంపూతో తల స్నానం చేస్తే చాలు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేయొచ్చు. ఇంకా మంచి రిజల్ట్ రావాలంటే ఆనియన్ జ్యూస్‌తోపాటు, కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ కూడా కలిపి వాడొచ్చు. ఫ్రెష్ యాపిల్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. అయితే ఉల్లిగడ్డ వాసన పడనివాళ్లు, అలర్జీస్ ఉన్నవాళ్లు ఇది వాడకూడదు.