ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం బెడ్లు సర్కార్ కు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం బెడ్లు సర్కార్ కు
  • మేనేజ్ మెంట్లు అంగీకరించాయి: ఈటల
  • ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ట్రీట్మెంట్
  • యాప్ ద్వారా అడ్మిషన్లు.. నేడు విధివిధానాలు

 

ప్రైవేట్ హాస్పిటళలోని సగం బెడ్లను సర్కార్‌కు ఇచ్చేందుకు.. ఆ ఆస్పత్రుల మేనేజ్ మెంట్స్ అంగీకరించాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. గురువారం ఆయన సెక్రటేరియ ట్‌లో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీషా) ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనంతరం ఈటల ఒక ప్రకటన విడుదల చేశారు. హాస్పిటళలోని 50 శాతం బెడ్లలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల మేనేజ్ మెంట్లు ఒప్పకున్నాయని మంత్రి తెలిపారు. వీటిలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే ట్రీట్ మెంట్ అందిస్తారని చెప్పారు. ఈ బెడ్లను వైద్యారోగ్య శాఖనే ఫిల్ చేస్తుందని,ఇందుకోసం ప్రత్యేక యాప్‌‌ను వినియోగిస్తామని పేర్కొన్నారు. పూర్తి విధివిధానాలు రూపొందించేందుకు ప్రైవేట్ హాస్పిటళ్ల మేనేజ్ మెంట్స్ తో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. మంత్రితో భేటీలో ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.

ఇదీ జరిగింది

కరోనా పేషెంట్లవద్ద ప్రైవేట్ హాస్పిటళ్లు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తుండడంతో, ట్రీట్‌‌మెంట్ రేట్లను ప్రభుత్వమే ఫిక్స్ చేసింది. ఐసోలేషన్‌ బెడ్‌‌ కు రోజుకు గరిష్టంగా రూ.4వేలు, ఐసీయూలో రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌కు రోజుకు రూ.9 వేలు మాత్రమే చార్జ్చేయాలని జూన్‌ 15న ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ ఫీజులు, నర్సింగ్ చార్జెస్, కొన్ని రకాల టెస్టులు, పేషెంట్‌‌కు అందించే ఫుడ్ వంటివన్నీఇందులోనే కవర్ అవుతాయని, హైఎండ్‌‌ ప్రొసీజర్స్‌‌, డ్రగ్స్‌‌కు మాత్రమే వేరుగా చార్జ్‌‌చేయాలని సూచించింది. అది కూడా పోయినేడాది డిసెంబర్‌ నాటి ధరల ప్రకారమే చార్జ్‌‌ చేయాలని పేర్కొంది. కానీ, ప్రైవేట్ మేనేజ్మెంట్లు సర్కార్ ఆదేశాలను లెక్క చేయలేదు. పేషెంట్లను అడ్డగోలుగా దోచుకోవడం ఆపలేదు. వేల కంప్లయిం ట్స్ వచ్చినా, చర్యలు తీసుకునేందుకు సర్కార్ ధైర్యం చేయలేదు. కేవలం రెండు దవాఖాన్ల పై నామమాత్రపు చర్యలు తీసుకుంది. దీంతో దోపిడీ ఆగలేదు. పద్ధతి మార్చుకోకపోతే 50 శాతం బెడ్లను స్వాధీనం చేసుకుంటామని సర్కార్ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటళ్ల ప్రతినిధులు వచ్చి మంత్రి ఈటలతో భేటీ అయ్యారు. ‘‘సగం బెడ్లలో సర్కారీ ప్యాకేజీల ప్రకారం చార్జ్ చేస్తం. మిగిలిన సగం బెడ్లను మాకు వదిలేయాలి” అని విజ్ఞప్తి చేశారు.