2100 నాటికి సగం బీచ్ లు కనుమరుగు

2100 నాటికి సగం బీచ్ లు కనుమరుగు

గోవా టూర్​ అనగానే ముందు గుర్తొచ్చేది బీచ్​. వైజాగ్​ వెళ్తే అక్కడి బీచుల్లో సరదాగా గడపనిది రాలేం. సముద్ర తీర ప్రాంతాలకు టూర్​ వేసినప్పుడు లిస్ట్​లో కచ్చితంగా అది ఉండి తీరుతుంది. అంతేకాదు, టూరిజంతో ప్రభుత్వ ఖజానాను నింపుతాయవి. కొన్ని తెగలకు తిండి పెడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను తుఫాన్ల నుంచి రక్షించే కవచాల్లా పనిచేస్తున్నాయి. అలాంటి బీచులే ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఈ శతాబ్దం చివరి నాటికి (2100) ప్రపంచంలోని సగం బీచులు కనుమరుగైపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి 14 నుంచి 15 శాతం బీచులు తమ రూపు రేఖలను కోల్పోయి, గుర్తు పట్టలేనంతగా తయారయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. అవును, ఇటలీలోని యూరోపియన్​ కమిషన్​ జాయింట్​ రీసెర్చ్​ సెంటర్​కు చెందిన సైంటిస్టులు, స్పెయిన్​, పోర్చుగల్​, నెదర్లాండ్స్​కు చెందిన రీసెర్చర్లు కలిసి చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బీచులకు సంబంధించిన దాదాపు 30 ఏళ్ల శాటిలైట్​ ఫొటోలను విశ్లేషించి ఈ విషయం చెప్పారు. సముద్రాలు వంద మీటర్లు ముందుకు జరిగి బీచ్​లను తమలో కలిపేసుకుంటాయని తేల్చారు.

మన చేతులారా చేసుకుంటున్నం

బీచులు కనుమరుగైపోవడానికి కారణం మారుతున్న వాతావరణ పరిస్థితులేనని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, దాని వాటా కొంచెమేనన్నది వారి వాదన. మనమే చేజేతులా బీచ్​లు అంతమైపోయేలా చేస్తున్నామని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని సముద్ర తీర ప్రాంతాల్లో 30 శాతం మేర బీచులున్నాయంటున్నారు. ఆయా దేశాలకు ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు అక్కడి కొన్ని తెగలకు బతుకుదెరువును ఇస్తున్నాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వెకేషన్​ డెస్టినేషన్​ కన్నా ఎక్కువగానే బీచ్​లను చూస్తున్న సందర్భాలున్నాయి. బ్రెజిల్​, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కొన్ని తెగలకు అదే ఆధారం. అలాంటి బీచ్​లను మనిషి ఆక్రమించేస్తున్నాడని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. డెవలప్​మెంట్​ పేరుతో తీరాల్లో పెద్ద పెద్ద కట్టడాలు కట్టేయడం, ఇసుక తిన్నెల్లో అడ్డంగా గోడలు లేపడం వంటివి చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. మామూలుగా బీచ్​లు వాతావరణానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటాయని, సముద్ర మట్టాలు, అలల్లో తేడాలకు తగ్గట్టుగా బీచులు సహజంగా తమను తాము మార్చుకుంటూ ఉంటాయని అంటున్నారు. ముందుకు వెళ్లడం, మళ్లీ వెనక్కు తగ్గడం వంటివి సహజంగా జరుగుతుంటాయని చెబుతున్నారు. కానీ, బీచులకు సమీపంలో అలాంటి కట్టడాల వల్ల ఆ సహజత్వం కోల్పోయి, విపత్తులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బీచులతో పాటు కట్టడాలన్నింటినీ సముద్రాలు తమలో కలిపేసుకుంటాయని తేల్చి చెబుతున్నారు.

ఆస్ట్రేలియాకే ఎక్కువ నష్టం

అమెరికా తూర్పు తీరం, దక్షిణాసియా, మధ్య యూరప్​లపైనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు తేల్చారు. అమెరికా, కెనడా, చైనా, చిలీ, మెక్సికో, ఆస్ట్రేలియా, రష్యా, అర్జెంటీనా వంటి దేశాలు ఎక్కువ నష్టాన్ని చవి చూస్తాయట. వాటితో పాటు కరీబియన్​ లాంటి కొన్ని చిన్న దీవులూ సముద్రంలో కలిసిపోతాయట. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోనే ఎక్కువ నష్టం జరుగుతుందని సైంటిస్టులు తేల్చారు. 12 వేల కిలోమీటర్ల పొడవున విస్తరించిన బీచులు సముద్రంలో కలిసిపోయే ముప్పు ఉందని,  సగం బీచులు ప్రమాదపుటంచున ఉన్నాయని అంటున్నారు.

ఏం చేయాలి?

బీచ్​ల పరిస్థితిని 30 ఏళ్ల శాటిలైట్​ ఫొటోల ఆధారంగా కంప్యూటర్​ మోడలింగ్​ ద్వారా సైంటిస్టులు విశ్లేషించారు. రిప్రజెంటేటివ్​ కాన్సంట్రేషన్​ పాత్​వేస్​ (ఆర్సీపీ)ల్లో రెండు సందర్భాలను లెక్కలోకి తీసుకున్నారు. ఒకటి ఆర్సీపీ 8.5, ఇంకోటి ఆర్సీపీ4.5లను లెక్కగట్టి బీచ్​లకు ఎదురయ్యే ప్రమాద తీవ్రతను అంచనా వేశారు. ఆర్సీపీ8.5 అంటే వాతావరణంలోకి ఎక్కువగా కాలుష్యకారకాలను వదిలిన సందర్భం, ఆర్సీపీ4.5 తక్కువ కాలుష్యకారకాలు గాల్లో కలవడం. ఈ లెక్కల ఆధారంగా ఆర్సీపీ8.5తో 30 నుంచి 60 శాతం వరకు లోతట్టు ప్రాంతాలు సముద్రంలో కలిసిపోవడం ఖాయమని నిర్ధారించారు. కాలుష్యాన్ని తగ్గించి ఎంతో కొంత అదుపులో పెట్టుకుంటే బీచ్​ల నష్టాన్ని కనీసం 40 శాతం వరకైనా ఆపొచ్చని చెబుతున్నారు. పారిస్​ ఒప్పందానికి తగ్గట్టు టెంపరేచర్లను 1.5 డిగ్రీలకు తగ్గించడంతో పాటు, బీచులను నాశనం చేసే పనులు ఆపేస్తే వాటిని కొంతలో కొంతైనా కాపాడొచ్చని సూచిస్తున్నారు.