సియోల్‌లో తొక్కిసలాట.. 120 మంది దుర్మరణం

సియోల్‌లో తొక్కిసలాట.. 120 మంది దుర్మరణం

హాలోవీన్‌  వేడుకలు జరుగుతున్న వేళ దక్షిణకొరియా రాజధాని నగరం సియోల్‌లో  ఘోరం చోటు చేసుకుంది. నగరంలోని ఇటేవానే అనే ప్రాంతంలో ఉన్న ఓ ఇరుకైన వీధిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో దాదాపు 120 మంది మృతిచెందారని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మరో 100 మందికిపైగా గాయాలపాలయ్యారని తెలిపాయి. తొక్కిసలాట వల్ల ఎంతోమంది గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. ఇటేవాన్ ప్రాంతం సమావేశ మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్ లకు నిలయం. హాలోవీన్ వేడుకల వేళ ఇటేవాన్ ప్రాంతానికి దాదాపు లక్ష మంది ప్రజలు తరలివచ్చారు.  

శనివారం రాత్రి ఇటేవాన్ ఏరియా జనం రద్దీతో కిక్కిరిసిపోయింది.  ఓ వైపు డీజే సౌండ్స్ మోగుతుండగానే.. మరోవైపు అకస్మాత్తుగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు 140 అంబులెన్స్‌లలో క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో హాలోవీన్ వేడుకలు గత రెండేళ్లు జరగలేదు.  దీంతో రెండేళ్ల బ్రేక్‌ తర్వాత ఈసారి వైభవంగా ప్రారంభమైన హాలోవీన్ వేడుకల్లో అపశృతి చోటుచేసుకోవడం గమనార్హం.