TRANSCO ప్రైవేటీకరణను అడ్డుకోండి..రాహుల్‌‌ గాంధీకి హరీశ్‌‌ రావు లేఖ

TRANSCO ప్రైవేటీకరణను అడ్డుకోండి..రాహుల్‌‌ గాంధీకి హరీశ్‌‌ రావు లేఖ
  •     ఢిల్లీలో వ్యతిరేకించి.. రాష్ట్రంలో మాత్రం అమ్మకాలా?
  •     విద్యుత్‌‌ సంస్థలు, సింగరేణిని కాపాడాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీజీ -ట్రాన్స్‌‌కోతోపాటు జెన్‌‌కో, డిస్కంలు, సింగరేణి వంటి కీలక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ చూస్తోందని, దీనిని వెంటనే అడ్డుకోవాలని కోరుతూ లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు శుక్రవారం లేఖ రాశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎల్‌‌ఐసీ, విద్యుత్‌‌ రంగాన్ని అమ్ముతోందని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లోనూ గళమెత్తే కాంగ్రెస్‌‌ పార్టీ.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌‌పరం చేస్తుంటే మౌనంగా ఉండటం రాహుల్‌‌ గాంధీ విశ్వసనీయతకే ప్రశ్నగా మారిందని పేర్కొన్నారు. 2019 మేనిఫెస్టో, 2023 రాయ్‌‌పూర్ ప్లీనరీ తీర్మానాల్లో కీలక ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పిందని గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాలు ఢిల్లీకి మాత్రమే పరిమితమా..? హైదరాబాద్‌‌కు వర్తించవా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌కు కూడా లేఖ ప్రతులను  పంపినట్టు వివరించారు.

రాష్ట్ర విద్యుత్ రంగానికి టీజీ-ట్రాన్స్‌‌కో వెన్నెముక..

టీజీ -ట్రాన్స్‌‌కో సాధారణ వాణిజ్య సంస్థ కాదని, రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నెముక లాంటి సంస్థ అని హరీశ్‌‌ రావు గుర్తుచేశారు. ఈ సంస్థ పరిధిలో 29 (400-కేవీ), 107 (220-కేవీ), 337 (132-కేవీ) సబ్‌‌స్టేషన్లతోపాటు 31,420 సర్క్యూట్‌‌ కిలోమీటర్ల లైన్లు, 43,848 ఎంవీఏ కెపాసిటీ కలిగిన 1,184 ట్రాన్స్‌‌ఫార్మర్లు ఉన్నాయని తెలిపారు. ఇంతటి విలువైన ఆస్తిలో ఐపీవో పేరుతో 26 శాతం వాటాను ప్రైవేట్‌‌ వ్యక్తులకు కట్టబెట్టడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌‌కోతో మొదలయ్యే ఈ విక్రయాలు రేపు జెన్‌‌కో, డిస్కంలు, సింగరేణికి కూడా విస్తరించే ముప్పు ఉందని, కావున రాహుల్‌‌ గాంధీ వెంటనే జోక్యం చేసుకుని టీజీ-ట్రాన్స్‌‌కో 26 శాతం వాటాల ఉపసంహరణతోపాటు ఇతర సంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే ఆపాలని డిమాండ్‌‌ చేశారు.

ఆడబిడ్డకు తులం బంగారం హామీ నిలబెట్టుకోవాలి
కల్యాణ లక్ష్మీ స్కీమ్ లో భాగంగా ఆడబిడ్డలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామంటూ ఎన్నికల టైంలో  ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మీ స్కీమ్ ప్రారంభించి 12 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా  స్పందించారు. 2014లో కేసీఆర్ కల్యాణ లక్ష్మి స్కీమ్ ను ప్రారంభించారని,  రూ. 51వేలు మొదలు కొని.. రూ. లక్ష వరకూ పొడగించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. తులం బంగారం ఏమోగాని.. కనీసం  లక్ష రూపాలు కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ మీద కక్షతో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ స్కీమ్ లను నిర్వీర్యం చేయొద్దని, పెండింగ్ లో ఉన్న 2 లక్షల దరఖాస్తులను క్లియర్ చేయాలని హరీశ్ కోరారు.