అన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్​కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు

అన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్​కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు
  • ఈ సీజన్​లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్
  • రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం
  • 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు

మంచిర్యాల, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం ఖర్చులన్నీ తానే చెల్లిస్తున్నానని కేంద్రం చెపుతున్నప్పటికీ, హమాలీ చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఆ ఖర్చులను రైతులే భరిస్తున్నారు. పీపీసీ సెంటర్లలో హమాలీ చార్జీలు క్వింటాల్​కు రూ.55 నుంచి రూ.60 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక రైతు 50 క్వింటాళ్ల వడ్లు అమ్మితే హమాలీ ఖర్చులకే రూ.2,750 చెల్లించాల్సి వస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్​కు రూ.2,320 ఇస్తుండగా, ఇందులో రూ.55 హమాలీకే పోతున్నాయి. సంచుల్లో వడ్లు నింపి, కాంటా వేసి లారీల్లో లోడింగ్  చేయడం వరకు రైతుల సపోర్ట్​ లేకుండా జరగడం లేదు. వీటితో పాటు ట్రాన్స్​పోర్ట్​ చార్జీలు మరో రూ.3 వేల నుంచి రూ.5 వేలు అవుతున్నాయి. ఇది రైతులకు భారంగా మారుతోంది. 

రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లలో..

ఈ ఏడాది యాసంగి సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 127.50 లక్షల మెట్రిక్  టన్నుల దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 70.13 లక్షల మెట్రిక్  టన్నుల వడ్లు సేకరించాలని ప్రభుత్వం  టార్గెట్​గా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,337 సెంటర్లను ఏర్పాటు చేసింది. 7 కోట్ల ఒక లక్ష 30 వేల క్వింటాళ్ల వడ్లను సేకరిస్తోంది. క్వింటాల్​కు సగటున రూ.55 చొప్పున లెక్కేస్తే రూ.385 కోట్ల 71 లక్షల 50 వేలు హమాలీ చార్జీలకే పోతున్నాయి. 

చేతులెత్తేసిన సర్కారు..

ధాన్యం సేకరణకు సంబంధించి హమాలీ చార్జీలను గతంలో సర్కారే చెల్లించేది. క్వింటాల్​కు రూ.5.30 ప్రభుత్వం చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని రైతులు భరించేవారు. దీంతో వారికి కొంత వెసులుబాటు లభించేది. 2017 యాసంగి సీజన్  నుంచి ప్రభుత్వం హమాలీ చార్జీలను నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ ఖర్చును రైతులే భరిస్తున్నారు. ఏటేటా చార్జీలు పెరుగుతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 

కొన్ని సెంటర్లలో హమాలీలు కాంటా వేయడానికే పరిమితం అవుతున్నారు. లారీల్లో లోడింగ్  చేయడానికి అదనంగా క్వింటాల్​కు రూ.10 వరకు డిమాండ్  చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో హమాలీ, ట్రాన్స్​పోర్టు చార్జీలు భారంగా మారుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వమే చెల్లించాలి..

కొనుగోలు సెంటర్లలో హమాలీ చార్జీలు క్వింటాల్​కు రూ.60 చొప్పున తీసుకుంటున్నారు. ఈసారి నాకు 60  క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. హమాలీ చార్జీలు రూ.3,600 చెల్లించాను. రోడ్డుకు కొంచెం దూరంగా ఉన్న వడ్లను కాంటా చేయడానికి రూ.65 వసూలు చేస్తున్నారు. హమాలీ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తే భారం తగ్గుతుంది.

– పెండ్యాల సాయిలు, భీమారం