సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. హైదరాబాద్ లోని రోడ్డుకు ట్రంప్ పేరు

సీఎం రేవంత్ కీలక నిర్ణయం..  హైదరాబాద్ లోని రోడ్డుకు ట్రంప్ పేరు

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని పలు రోడ్లకు ప్రముఖులు పేర్లు పెట్టాలని నిర్ణయించారు.  గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు,ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు,  గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో  పాటు మరి కొన్ని రహదారులకు   ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు ,అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. రహదారులకు ప్రముఖుల పేరు పెట్టడం వల్ల నగర ఖ్యాతిని పెంచవచ్చని..అంతేగాకుండా వారికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది

గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం.

మరో వైపు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.  రేపటి నుంచి జరగబోయే గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో  44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు.

తొలిరోజు డిసెంబర్ 8న మధ్నాహ్నం 1.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ  గ్లోబల్ సమ్మిట్ ను  లాంఛనంగా  ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం ఆహుతులకు వివరిస్తారు.