- జేపీఎల్ రెండో సీజన్ ప్రారంభించిన మాజీ మంత్రి
హైదరాబాద్: జర్నలిస్టులు సమాజ హితం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం దుండిగల్‌లోని ఎంఎల్ఆర్‌ఐటీ క్రికెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎన్‌ఈసీసీ– జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) సీజన్-2 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన లీగ్‌లో పాల్గొంటున్న పది మీడియా జట్ల జెర్సీలను ఆవిష్కరించారు.అనంతరం టాస్ వేసి తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో, డెడ్‌లైన్లతో బిజీగా ఉండే జర్నలిస్టుల వృత్తిలో సెలవులు ఉండవని హరీష్ రావు పేర్కొన్నారు.
ఫీల్డ్ జర్నలిస్టులు ఎండ, వాన లెక్కచేయకుండా తిరగడం, డెస్క్ జర్నలిస్టులు రాత్రి వేళల్లో పనిచేయడం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "మనిషి ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలరు.
కాబట్టి జర్నలిస్టులందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలి," అని ఆయన సూచించారు. జర్నలిస్టులు తమ కోసం కొంత సమయం వెచ్చించి ఐదు రోజుల పాటు ఈ లీగ్‌ను నిర్వహించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
వెటరన్ అథ్లెట్ లక్ష్మణ్ రెడ్డికి సన్మానం
80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్, స్లైకింగ్‌లో రాణిస్తూ పతకాలు గెలుస్తున్న వెటరన్ అథ్లెట్, ఎంఎల్ఆర్‌ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఫిట్‌నెస్‌ను హరీష్ రావు ప్రశంసించారు. 80 ఏళ్ల వయసులోనూ 21 ఏళ్ల యువకుడిలా ఉండడానికి ఆయన ఫిట్‌నెస్‌కు ఇస్తున్న ప్రాధాన్యతే కారణమన్నారు.
యువత లక్ష్మణ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఎంఎల్ఆర్‌ఐటీ విద్యాసంస్థల సెక్రటరీ, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
