నగర పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయండి : ప్రొ.కూరపాటి వెంకటనారాయణ

నగర పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయండి :  ప్రొ.కూరపాటి వెంకటనారాయణ

హనుమకొండ సిటీ, వెలుగు: గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వరంగల్ మహానగర పునర్నిర్మాణం వేగవంతం చేయాలని ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొ.కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో జనాభా, వైశాల్యం, వనరుల లభ్యత, అభివృద్ధి సామర్థ్యంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారీతిన జిల్లాల పునర్విభజన చేపట్టారన్నారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలు చేసి ప్రాంత అభివృద్ధిని, కాకతీయ చరిత్రను విధ్వంసం చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా వరంగల్ మహానగర పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్, సాయిని నరేందర్, డాక్టర్ చందా మల్లయ్య, డాక్టర్ నల్లాని శ్రీనివాస్, మెరుగు బాబు యాదవ్, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.