ఇకపై డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్ 

ఇకపై డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్ 

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ తో పాటు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్ లో నమోదు చేసి ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక రిఫరెన్స్ నెంబరు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. డివిజన్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అంతకుముందు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ బిల్లులు, సర్జికల్ ఐటమ్స్,మెడిసిన్స్, ఆసుపత్రి నిర్వహణ, బడ్జెట్, ఆసుపత్రికి కావాల్సిన వనరులు, తదితర అంశాలపై చర్చించారు.