వరంగల్ లోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించలేదు. స్కూల్స్ ప్రారంభమై రెండు నెలలు దాటినా విద్యార్థులకు బుక్స్ ఇవ్వలేదు. దీంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల పాత పుస్తకాలు సేకరించి స్టూడెంట్స్ కి ఇచ్చేందుకు టీచర్లు ప్రయత్నిస్తున్నారు హనుమకొండ జిల్లాకు మొత్తం 3 లక్షల 72 వేల పాఠ్య పుస్తకాలు అవసరముండగా మొత్తం లక్షా 34 వేల పాఠ్య పుస్తకాలు వచ్చినట్లు టీచర్లు చెబుతున్నారు. 36 శాతం మాత్రమే బుక్స్ పంపిణీ చేశారు. బుక్స్ లేకుండా క్లాసులు వినడం కష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొనేందుకు v6 ప్రయత్నించింది. విద్యార్థులు, టీచర్స్ లతో మాట్లాడింది.
బ్రిడ్జీ కోర్సు ద్వారా నేర్పడం ద్వారా విద్యార్థులకు చదువు చెప్పడంతో వారు కొంత నేర్చుకున్నారని టీచర్ తెలిపారు. పాత పిల్లల బుక్స్ తీసుకుని వీరికి ఇచ్చామన్నారు. జూలై నెల నుంచి క్లాసులు స్టార్ట్ అయినా.. బుక్స్ లేకపోవడంతో చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. స్కూల్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది.. కానీ.. ఇప్పుడా ఆ పరిస్థితి లేదన్నారు. కనీసం కొంతమందికి యూనిఫాం అందలేదని..దీనికారణంగా.. ఏదో ఒక డ్రెస్ వేసుకుని వస్తున్నారని టీచర్ వెల్లడించారు. పునాది గట్టిగా ఉంటేనే.. భవిష్యత్ లో విద్యార్థులు రాణిస్తారని మరో ఉపాధ్యాయుడు తెలిపారు. వెంటనే తమకు బుక్స్ అందివ్వాలని విద్యార్థులు కోరారు.
