
సికింద్రాబాద్, వెలుగు: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడు ట్రైన్లో 9.5 తులాల బంగారు ఆభరణాలు ఉన్న సూట్‌కేస్‌ను పోగొట్టుకోగా, రైల్వే పోలీసులు గుర్తించి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన గణేశ్ బంధువుల ఇంట్లో జరుగుతున్న పెండ్లి కోసం వైజాగ్ వెళ్లాడు. ఆదివారం ఉదయం గరీబ్‌రథ్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు.
ట్రైన్ దిగే టైంలో తన వెంట తెచ్చుకున్న సూట్‌కేస్‌ను బోగీలోనే మర్చిపోయాడు. స్టేషన్ బయటికి వెళ్లక ముందే గుర్తించిన గణేశ్ వెంటనే ట్రైన్‌లోకి వెళ్లి చూడగా సూట్కేస్ కనిపించలేదు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన సిబ్బందితో తనిఖీ చేపట్టగా స్టేషన్‌లోని ఓ ప్రయాణికుడు వద్ద సూట్‌కేస్‌ను గుర్తించి గణేశ్‌కు అప్పగించారు. కాగా అందులో 9.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి.