
- కిడ్నాప్ చేసిన ముగ్గురు అరెస్ట్
శంషాబాద్, వెలుగు : చిన్నారి కిడ్నాప్ కేసును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. శంషాబాద్ ఫ్లై ఓవర్ కింద ఉంటూ.. చిత్తు కాగితాలు ఏరుకునే దంపతులకు అంజలి(5), చిన్నారి (ఒక నెల) ఉన్నారు. ఈనెల 27న రాత్రి ఫ్లై ఓవర్ కింద దంపతులు తమ పిల్లలతో కలిసి నిద్రపోయారు.
ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. దంపతులు స్థానికంగా వెతికినా జాడ దొరకలేదు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు కంప్లయింట్ చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లై ఓవర్ ప్రాంతంలోని 22 సీసీ ఫుటేజ్ లను చెక్ చేయగా ఆ రోజు రాత్రి ఇద్దరు మహిళలు ముఖానికి చున్నీలు కట్టుకుని వచ్చి పాపను ఎత్తుకెళ్లినట్టు కనిపించింది.
దీంతో మైలార్ దేవ్ పల్లి బృందావన్ కాలనీకి చెందిన దండు హనుమంతరావు (31), దండు చందన (26), శంషాబాద్ సిద్ధాంతి బస్తీకి చెందిన బొంగపటి స్వాతి(28)లుగా గుర్తించి శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.