- సేవ్ నందనవనం.. సేవ్ గర్ల్స్’ అంటూ హోరెత్తిన నినాదాలు
- మీర్‌పేట ఘటనను నిరసిస్తూ స్థానికుల ఆందోళన
- రోడ్డుపై బైఠాయించి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతల ధర్నా
- శాంతి భద్రతలపై రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అంటూ ఫైర్
- ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి వివిధ పీఎస్‌లకు తరలించిన పోలీసులు
ఎల్ బీనగర్,వెలుగు: అడ్డగోలుగా పెరిగిన బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న గంజాయి కారణంగానే మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతు న్నాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలపై మహేశ్వరం ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి పట్టింపు లేదని విమర్శించారు. పట్టపగలు చిన్నారిపై గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎల్బీనగర్ పరిధి మీర్‌పేటలోని నందనవనంలో బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్‌ను ఖండిస్తూ.. నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సేవ్ నందనవనం..సేవ్ గర్ల్స్’ అంటూ నినదించారు. అనంతరం బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మహేశ్వరం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, బడంగ్ పేట కాంగ్రెస్ మేయర్ చిగురింత పారిజాత, బీఎస్పీ నేత జక్కా యాదగిరి మాట్లాడారు.
నిత్యం దొరికే గంజాయి, డ్రగ్స్‌తో పాటు బెల్ట్ షాపుల కారణంగా మహిళలు, చిన్నారులపై అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రౌడీ షీటర్లు దారుణాలు చేస్తున్నా రాష్ట్ర సర్కార్‌కు పట్టదా..? అని ప్రశ్నించారు. నినాదాలతో నందనవనం హోరెత్తింది. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. దీంతో నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
స్థానికుల ఆందోళన..
తమ సమస్యలను పరిష్కరించే నాయకులు లేరని.. బెల్ట్ షాపులను ప్రేరేపించే లీడర్లే ఇక్కడ ఎక్కువగా ఉన్నారని నందనవనం ఏరియాలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయని, గంజాయి అడ్డగోలుగా దొరుకుతుందని ఆవేదనతో చెప్పారు. స్థానికంగా బెల్ట్ షాపులు తొలగించి మందు, మత్తు బాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మహిళా నేతకు గాయాలు
పోలీసులు అరెస్ట్ చేస్తుండగా జరిగిన తోపులాటలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్యామలకు గాయాలయ్యాయి. ఆమె ముక్కు, నోట్లో నుంచి రక్తం కారింది. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తోసి వేయడంతోనే ఆమెకు గాయాలయ్యాయని పార్టీ నేతలు మండిపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.