సర్పంచ్ పదవికి వేలం.. చివరకు పరేషాన్?.. హన్మకొండ జిల్లా జయగిరిలో ఎన్నికల హంగామా

సర్పంచ్ పదవికి వేలం.. చివరకు పరేషాన్?.. హన్మకొండ జిల్లా జయగిరిలో ఎన్నికల హంగామా

హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామ సర్పంచ్ పదవిని వేలం వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామాభివృద్ధికి రూ. 50  లక్షలు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థికి గ్రామస్తులు మద్దతు పలికారు. కాగా.. 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఎన్నికల కంటే గ్రామాభివృద్ధే ముఖ్యమని భావించిన గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. 

శనివారం   పంచాయతీ సమీపంలోని హనుమన్ ఆలయంలో సమావేశం అయ్యారు. సర్పంచ్ అభ్యర్ధి అడ్వకేట్ తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు గ్రామంలో కనకదుర్గ, పోచమ్మ ఆలయాలు, వాటర్ ప్లాంట్, కోతుల బెడద, ఆస్పత్రి వంటి నిర్మాణాలకు సొంతంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. దీంతో మిగిలిన అభ్యర్థులు అంగీకరించి, నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్లు సమాచారం. కాగా.. ఆరుగురు నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా,  మరో అభ్యర్థి పల్లె దయకర్ చివరి క్షణంలో విత్ డ్రా చేసుకోకపోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు విస్తుపోయారు. ఇద్దరు పోటీ పడుతుండగా ఫలితాన్ని ఎన్నిక తేల్చనుంది.