- రిపోర్ట్ ఆధారంగా సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం శాయంపేట, కాట్రపల్లి గ్రామాల్లో గత రబీ సీజన్ లో ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్లలో రూ.కోట్లలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ముగ్గరు వ్యవసాయ అధికారులపై వేటు పడింది. మండల వ్యవసాయ అధికారి గంగాజమున, శాయంపేట క్లస్టర్ ఏఈవో అర్చన, నేరేడుపల్లి కస్టర్ ఏఈవో సుప్రియను నస్సెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు సెంటర్లలో వడ్లు లేకుండానే ఉన్నట్లుగా ట్రక్ షీట్లు రాసి, ఆన్ లైన్ ఎంట్రీలు చేసి, నకిలీ రైతులను సృష్టించి రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ స్కామ్ లో భాగస్వాములైన ఏఈవోలు టోకెన్లను జారీ చేయడం, విస్తీర్ణం పెంచడంతో పాటు, ఏవో తమ లాగిన్లలో పంపించారు. ఇదంతా సివిల్ సప్లై, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీల్లో తేలింది. 21 మందిపై గత నెల 11న శాయంపేట పీఎస్ లో కేసు నమోదైంది.
దీనిపై ఏవో, ఏఈవోలపై జిల్లా వ్యసాయ శాఖ అధికారులు కమిషనర్ కు ఇంతకు ముందే లేఖ రాశారు. దీంతోపాటు కేసు విచారణ అధికారి పరకాల ఏసీపీ సతీశ్ బాబు నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అయితే.. ప్రస్తుతం ఏవో గంగాజమున సెలవులో ఉండగా, ఓఏఈవో సుప్రియ జైలులో, ఇంకో ఏఈవో విధుల్లో ఉన్నారు.
