
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పిరియడ్ డ్రామా చిత్రం 'ఫౌజీ'. ఇప్పటికే 'రాజా సాబ్' షూటింగ్‌లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సినిమాతో ఇండియన్ సినీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఒకటి సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.
1940ల నాటి ఎమోషనల్ యాక్షన్ డ్రామా!
ఈ చారిత్రక ప్రేమకథా చిత్రాన్ని .. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు ఆగస్టు 14, 2026 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి తన 'సీతారామం'తో చూపించిన అద్భుతమైన ఫీట్‌ను, ఈసారి మరింత పెద్ద స్కేల్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఫౌజీ' కథనం 1940ల నాటి స్వాతంత్య్ర పూర్వ భారతంలో సాగుతుంది. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలోని ఒక సైనికుడిగా ప్రభాస్ పాత్ర హైలైట్‌గా నిలవనుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం , స్వాతంత్ర్యం కోసం ఆ సైనికుడి ప్రయాణం ఎలా సాగింది అనే అంశాలతో కథనం గుండెలను కదిలించేలా ఉంటుందని సమాచారం.
ఈ భారీ ప్రాజెక్టును సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా, కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజువల్స్, అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కుతోంది. అంతేకాదు .. హను రాఘవపూడి ఈ కథనానికి సంబంధించి భవిష్యత్తులో ఒక ప్రీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ .
ప్రభాస్ సరసన ఇమాన్వి
'ఫౌజీ'లో ప్రభాస్ సరసన కథానాయికగా ఇమాన్వి టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. సహాయ పాత్రల్లో బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. సంగీతం సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సుదీప్ ఛటర్జీ పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని సమాచారం. 'రాజా సాబ్' విడుదలయ్యే వరకు 'ఫౌజీ' ప్రమోషన్స్‌ను పక్కన పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అభిమానుల డిమాండ్‌ను బట్టి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. 'స్పిరిట్', ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులకు ముందు ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చారిత్రక బ్లాక్‌బస్టర్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 2026లో ఖాకీ డ్రెస్సులో ప్రభాస్ చేసే గర్జన కోసం ఇండియన్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.