హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో బుధవారం వివిధ శాఖల ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 52 సెంటర్లలో 18,590 మంది ఫస్ట్ ఇయర్, 20,004 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్నారన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల స్పెషల్ బస్సులు నడపాలన్నారు. ప్రతి సెంటర్లో రెండు నుంచి మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మార్చి 14 నుంచి నిర్వహించే టెన్త్ వార్షిక పరీక్షలకు జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 12,079 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలు మౌలిక వసతులు కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. అనంతరం నిర్వహించిన డీసీసీబీ రిస్క్మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో కలెక్టర్ మాట్లాడుతూ మొండి బకాయిలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆఫీసర్లకు సూచించారు. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు, పెట్టుబడులు, రుణాల వసూళ్లు, బ్యాంకు ఆర్థిక స్థితిగతులు, వనరుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్, జనరల్ మేనేజర్ ఉషశ్రీ, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
