హనుమకొండ సిటీ, వెలుగు: జిల్లాలోని చెరువులు, కుంటల ప్రాముఖ్యతను గుర్తించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ లో ఆమె జిల్లా ఫారెస్ట్ అధికారి లావణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో తడి నేలలు గుర్తించి వాటి పరిరక్షణకు త్వరగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి బుధవారం వరకు నివేదిక సాగునీటిపారుదల అధికారులు అందజేయాలన్నారు.
జియో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా జిల్లాలో 267 చెరువులు, కుంటలు గుర్తించినట్లు చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యదర్శితో పాటు సాగునీటిపారుదల శాఖ అధికారులు సందర్శించి వివరాల నివేదికను సమర్పించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన జిల్లాలోని 11 చెరువులను సాగునీటి పారుదల శాఖ డీఈ లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత ఫార్మట్ లో సమగ్ర వివరాలను అందజేయాలన్నారు.
