- గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు 12.5 కి.మీ ప్రధాన యాత్ర
- కర్మన్‌ఘాట్, మల్కాజ్‌గిరి నుంచి 14 ఉప ఊరేగింపులు
- ప్రధాన యాత్రలో కలిసేవి మరో 168..
- యాత్ర సాగే దారుల్లో 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు
- ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సిద్ధం
బషీర్‌బాగ్, వెలుగు : హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో గురువారం ‘శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నారు. ప్రధాన యాత్ర ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రాంమందిర్నుంచి మొదలై తాడ్బండ్లోని హనుమాన్‌ఆలయం వద్ద రాత్రి 8 గంటలకు ముగియనున్నది. కర్మన్‌ఘాట్ హనుమాన్ఆలయంతో పాటు మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి వచ్చే14 ఉప ఊరేగింపులు ఈ ప్రధాన యాత్రలో కలవనున్నాయి.
మొత్తంగా అన్ని చోట్ల నుంచి కలిపి సుమారు 168 శోభాయాత్రలు ప్రధాన యాత్రలో కలవనున్నాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 92 స్థానిక ఊరేగింపులు నిర్వహించనున్నారు. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే ఉప-యాత్ర చంపాపేట్, ఐఎస్ సదన్, సైదాబాద్, మలక్‌పేట్ మీదుగా కోఠి వద్ద ప్రధాన యాత్రలో కలవనున్నది. ఈ ఉప-యాత్ర సుమారు 10.8 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. మొత్తం 12.5 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర సాగనుండగా, మల్కాజిగిరి పరిధిలో 2 కిలోమీటర్లు కొనసాగనున్నది.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా పటిష్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యాత్ర సాగే మార్గాల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ర్యాలీ సీటీవో జంక్షన్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. పలు చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తామన్నారు.
భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, గూడ్స్వెహికల్స్ప్రవేశాన్ని కొన్ని రూట్లలో పరిమితం చేశామన్నారు. సీటీవో - తాడ్‌బండ్, మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ రోడ్, సఫిల్‌గూడ - నేరెడ్మెంట్రోడ్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్,- ఏఎస్ రావు నగర్, సైనిక్‌పురి, యాప్రాల్, హస్మత్‌పేట్ , తాడ్‌బండ్, తార్నాకా,- హబ్సిగూడ రూట్లు, కర్మన్‌ఘాట్,- సరూర్‌నగర్, అల్కాపురి, ఎన్‌జీవోల కాలనీ నుంచి ఎల్‌బీ నగర్ వరకు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను, అలాగే మల్కాజిగిరి పరిధిలో 112, 8712662999, 8712662850 నంబర్లకు కాల్చేయాలన్నారు.
ఇక్కడే పార్కింగ్
శోభాయాత్ర మార్గాల్లో పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు జోయల్డేవిస్స్పష్టం చేశారు. ఎవరైనా వినకుండా పార్క్‌చేస్తే తొలగిస్తామన్నారు. తాడ్‌బండ్ శ్రీ హనుమాన్ ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ధోబీఘాట్, హనుమంత్ రెడ్డి కాంప్లెక్స్ (తాడ్‌బండ్ ఎక్స్ రోడ్స్), కార్ఖానాలోని ఇంపీరియల్ గార్డెన్స్ సమీప ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు.
ఆంక్షలు, మళ్లింపులు ఇలా..
గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్యారడైజ్ జంక్షన్ వరకు ప్రధాన శోభాయాత్ర పుత్లిబౌలి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, బైబిల్ హౌస్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం మీదుగా సాగుతుంది. అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్, రాంకోటి, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బైబిల్ హౌస్, ప్యారడైజ్ జంక్షన్ వంటి చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడం చేస్తారు. యాత్ర ఒక ప్రాంతాన్ని దాటిన వెంటనే అక్కడ ఆంక్షలను ఎత్తివేస్తారు.
ప్రయాణికులు ఇలా వెళ్లండి..
ప్రయాణికుల సౌలభ్యం కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. లక్డీకాపూల్ నుంచి కోఠి మీదుగా దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే వారు బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ ఫ్లైఓవర్ మార్గాన్ని ఉపయోగించుకోవాలి. దిల్‌సుఖ్‌నగర్ నుంచి మెహదీపట్నం వెళ్లే వారు ఎల్‌బి నగర్, ఉప్పల్, తార్నాక లేదా చంద్రాయణగుట్ట మార్గాలను ఎంచుకోవాలి. మధ్యాహ్నం తర్వాత సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు సోమాజిగూడ, బేగంపేట ఫ్లైఓవర్, ప్రకాష్ నగర్ రూట్లో వెళ్లాలి.
హనుమాన్ భక్తులారా తరలిరండి:భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్
కోఠి: వీర హనుమాన్ విజయయాత్రకు భక్తలోకం తరలిరావాలని భజరంగ్ దళ్ కోరింది. గురువారం ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు గౌలిగూడ రామమందిరంలో యజ్ఞం, 11గంటలకు కోఠి చౌరస్తాలో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు తెలిపారు. కోఠి విశ్వహిందూ పరిషత్ ఆఫీసులో భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ మాట్లాడారు. చాలీసా తర్వాత టూ వీలర్ర్యాలీ కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణ గూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్, ట్యాంక్ బండ్, బాటా, ప్యారడైజ్మీదుగా...తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో గిరిధర్ స్వామి ముఖ్య వక్తగా పాల్గొంటారన్నారు.
