మిస్టర్ కూల్.. మోస్ట్ సక్సెస్ ఫుల్

మిస్టర్ కూల్.. మోస్ట్ సక్సెస్ ఫుల్

మహేంద్రసింగ్ ధోని..ఈ పేరంటే ఓ చరిత్ర. పల్లెటూరి నుంచి వచ్చి ప్రపంచ క్రికెట్ను శాసించిన పేరిది. భారత క్రికెట్కు సరికొత్త వన్నెలద్దిన పేరు. టీమిండియా భవిష్యత్కు భరోసా ఇచ్చిన పేరు. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్కు సాధ్యం కాని రికార్డులను సాధించిన పేరు. అందుకే మహేంద్రసింగ్ ధోని అంటే దేశంలోనే కాదు..యావత్ ప్రపంచంలో ఇష్టపడని వారుండరు. కూల్ కెప్టెన్గా  పేరు సంపాదించి క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ధోని జన్మదినం ఇవాళ. 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్న  ఎంఎస్ ధోనికి శుభాకాంక్షలు చెబుతూ..ధోని గురించి మరిన్ని విశేషాలు.

ధోని సొంతూరు...


ఎంఎస్ ధోని..1981లో  బీహార్లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జూలై 7న రాజ్ పుత్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగి. చిన్నతనం నుంచి ధోనికి ఆటల పట్ల ఆసక్తి ఉండేది. క్రికెట్తోపాటు బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ ఆడేవాడు. ముఖ్యంగా ఫుట్బాల్ జట్టులో ధోని గోల్ కీపర్. అతను గోల్ కీపింగ్ అద్భుతంగా చేయడంతో..క్రికెట్ కోచ్ అతన్ని కీపింగ్ చేయమని కోరేవాడు. ధోని అందుకు ఒప్పుకోకపోయేవాడు. చివరకు కోచ్..ధోనిని క్రికెట్లో కీపర్గా మార్చేశాడు. అక్కడ నుంచి ధోని క్రికెట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆ తర్వాత హై స్కూల్ పూర్తి చేసిన ధోని పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. కుటుంబ పరిస్థితులు, తండ్రి సూచనతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేశాడు. రైల్వే స్టేషన్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా పనిచేశాడు. 1998 వరకు స్కూల్ లెవల్లో క్రికెట్ ఆడిన ధోని..ఆ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. 

భారత జట్టులోకి అరంగేట్రం..
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన ధోని..తొలిసారిగా బంగ్లాదేశ్ సిరీస్కు ఎంపికయ్యాడు. డిసెంబరు 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫస్ట్ మ్యాచ్లోనే డకౌటయ్యాడు.  ఆ తర్వాత పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 123 బంతుల్లోనే 148 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఏడాది జైపూర్లో శ్రీలంకపై  చేసిన 183 పరుగుల ఇన్నింగ్స్ హైలెట్. తన పవర్ హిట్టింగ్తో ధోని చేసిన పరుగులు ఇప్పటికీ ప్రత్యేకమే. ఈ ఇన్నింగ్స్ తర్వాత ధోని వెనుదిరిగిన చూసుకోలేదు. అంచలంచెలుగా ఎదిగాడు. జట్టులో కీలకమైన ఆటగాడిగా మారాడు.

తొలిసారి కెప్టెన్గా ...
2007 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టుపై తీవ్ర విమర్శల చెలరేగాయి. ఆ వరల్డ్ కప్లో ఘోర ఓటమితో ఇంటా బయటా విమర్శలు ఎదురయ్యాయి. ఈ తరుణంలో 2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఐసీసీ నిర్వహించింది. అయితే ఈ టోర్నీకి సీనియర్లను కాదని..బీసీసీఐ జూనియర్లను ఎంపిక చేసింది. ధోనికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. తన కూల్ కెప్టెన్సీతో ధోని జట్టును విజేతగా నిలిపాడు. అక్కడి నుంచి ధోని రెగ్యులర్ కెప్టెన్ అయిపోయాడు. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లకు ధోని సారథ్యం వహించాడు. సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును విజయపథంలో నడిపాడు. మాజీ కెప్టెన్లకు సాధ్యం కానీ ఎన్నో రికార్డులను కెప్టెన్గా ధోని సాధించాడు. 2013లో ఛాంఫియన్స్ ట్రోఫీ.  28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్‌ సాధించడంలో  క్రియాశీలక పాత్ర పోషించాడు. టెస్టులో జట్టును  నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టాడు.  క్రికెట్ వరల్డ్లో మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 

ధోని అవార్డులు..
కెప్టెన్గా ఎన్నో రికార్డులను సాధించిన ధోని..క్రికెటర్గానూ..కీపర్గానూ ఎన్నో రికార్డులను తనపేరున లిఖించుకున్నాడు. టెస్టుల్లో 4 వేల పరుగులు చేసిన ఏకైక వికెట్ కీపర్గా మహేంద్రసింగ్ ధోని నిలిచాడు. అటు  కెప్టెన్గా 50 సిక్స కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. క్రికెట్లో 10 వేల రన్స్ చేసిన నాలుగో భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. 50కిపైగా సగటుతో 10 వేల పరుగులు చేసిన మొదటి ఆటగాడు ధోని మాత్రమే.  52 సార్లు నాటౌట్గా నిలిచిన ఘనత ధోని సొంతం. కెప్టెన్గా, వికెట్ కీపర్గా అధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్ ధోని మాత్రమే. అంతేకాకుండా వన్డేల్లో  300కు పైగా క్యాచ్లు పట్టిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీయే. అటు టీ20ల్లో అత్యధిక అవుట్లు, అత్యధిక స్టంపింగ్లు చేసిన కీపర్గా చరిత్ర సృష్టించాడు. క్రికెటర్గా..కెప్టెన్గా క్రికెట్కు ధోని చేసిన సేవలకు గానూ...2009లో పద్మశ్రీ, 2007,2008 కి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2008,2009లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక 2018లో పద్మభూషణ్ లభించింది. 

మూడు ఫార్మాట్లలో ధోని పరుగులు..
మహేంద్ర సింగ్ ధోని..తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 90 టెస్టులాడాడు. 38.09 సగటుతో  59.11 స్ట్రైక్ రేట్తో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్థసెంచరీలున్నాయి. ఇక  350 వన్డేల్లో..50.57 సగటుతో 87.56 స్ట్రైక్ రేట్తో 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 183 నాటౌట్. 98 టీ20ల్లో  వెయ్యి 617 రన్స్ చేశాడు. రెండు అర్థ సెంచరీలు సాధించాడు. 

ఐపీఎల్లో ధోని మెరుపులు..
అంతర్జాతీయ టోర్నీలే కాదు..ఐపీఎల్లోనూ ధోని గొప్ప ప్లేయరు. గొప్ప కెప్టెన్. 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ధోని చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.  ధోని కెప్టెన్సీలో 12 సీజన్లు ఆడిన చెన్నై  11 సార్లు ప్లేఆఫ్స్​ చేరింది. అత్యధికంగా 9సార్లు ఫైనల్​ ఆడటం విశేషం. నాలుగు సార్లు టైటిల్ను సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో ఐపీఎల్‌ విన్నర్గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. అంతేకాదు.. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  కెప్టెన్‌గా 204 మ్యాచులకు గానూ.. 121 మ్యాచుల్లో విజేతగా నిలిపాడు. 82 మ్యాచుల్లో మాత్రమే ఓటమిపాలైంది. అంతేకాదు..చెన్నైను  రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ విన్నర్గా కూడా నిలిపాడు. మొత్తంగా 15 సీజన్లలో 234 మ్యాచులు ఆడిన ధోని..4978 పరుగులు సాధించాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 84 పరుగులు. 

క్రికెటర్గా కెరియర్ మొదలు పెట్టిన సమయంలో..జులపాల జుట్టతో అందరిని ఆకర్షించిన ధోని..క్రీజులోకి వచ్చాడంటే..అభిమానులు పండగ చేసుకునే వారు. జట్టు ఎలాంటి స్థితిలో ఉన్నా..తనదైన మార్కు షాట్లతో మ్యాచ్ను  ఫినిష్ చేసేవాడు. అందుకే ధోని వరల్డ్లోనే గొప్ప ఫినిషనర్గా పేరు సంపాధించాడు. ఆటగాడిగా జట్టుకు దూరమవొచ్చు. కానీ..అభిమానులకు ఎప్పటికీ దూరం కాలేడు. ఇప్పటికీ..ఎప్పటికీ..ఫ్యాన్స్  మనుసులో ధోని టీమిండియా కెప్టెనే..