సోషల్​మీడియాలో వేధింపులు…సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అరెస్ట్

సోషల్​మీడియాలో వేధింపులు…సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అరెస్ట్

ఎల్ బీ నగర్, వెలుగు: సోషల్ మీడియాలో ఓ మహిళకు అసభ్యకర చిత్రాలను పోస్ట్ చేస్తూ  వేధింపులకు గురి చేస్తున్న ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నెల్లూర్ జిల్లా గోకనపాలెంకు చెందిన సంగన్న వెంకటరమణ రెడ్డి(24) కాలేజీ రోజుల్లో తన క్లాస్ మెట్ ను ప్రేమించాడు. కానీ ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లయింది. యువతి హైదారాబాద్ కు వచ్చి తన భర్తతో కలిసి హస్తినాపురంలో ఉంటూ ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తోంది. ఈ క్రమంలో నగరానికి వచ్చిన వెంకటరమణారెడ్డి మియాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో పని చేస్తున్నాడు. కాలేజీ రోజుల్లో ప్రేమించిన యువతిని అప్పుడప్పుడు కలిసేవాడు. ఈ క్రమంలో యువతికి, వెంకటరమణరెడ్డికి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి అతడిని దూరం పెట్టడంతో ఆమెకు అసభ్యకర మెసేజ్ లు పంపుతూ, తన వద్ద ఉన్న పర్సనల్ ఫొటోలు ఆమె భర్తకు స్నేహితులకు వాట్సాప్​ ద్వారా పంపాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని భరత్ నగర్ లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ఇన్​స్పెక్టర్​ జలందర్ రెడ్డి మాట్లాడుతూ సెల్ఫీలకు యువత దూరంగా ఉండాలని సూచించారు.