సోషల్ మీడియాలో పెరుగుతున్న వేధింపులు

సోషల్ మీడియాలో పెరుగుతున్న వేధింపులు

ఎస్సార్​నగర్​లో ఉంటున్న ఇంటర్​ స్టూడెంట్​ శాలినికి ఇన్‌స్టా గ్రామ్ లో అఖిల్ అనే పేరుమీద  ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేసిన ఆమె అతడితో చాట్​చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ తమ అభిప్రాయాలు, అలవాట్లు, ఇష్టాలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో శాలిని అతడితో ఫోన్​లో మాట్లాడడం మొదలుపెట్టింది. పర్సనల్ ​విషయాలు కూడా అతడికి చెప్పింది. దీన్ని అడ్వాంటేజ్​గా తీసుకున్న అఖిల్​ అన్నీ బయటపెడతానని బ్లాక్​మెయిల్​ చేశాడు. హాఫ్ న్యూడ్ ఫొటోలు పంపించాలని బెదిరించాడు. న్యూడ్​గా వీడియో కాల్స్​ చేయమని ఒత్తిడి చేశాడు. వీటన్నింటిని ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసి తనను కలవాలని లేకపోతే ఆమె పేరెంట్స్ కి చెప్తానని భయపెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెతో మాట్లాడిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని అఖిల్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సోషల్​మీడియాలో పెరుగుతున్న వేధింపులు 

హైదరాబాద్, వెలుగు: ఇంతకుముందు అమ్మాయిలను రోడ్ల మీద, బస్టాండ్ల  దగ్గర, స్కూల్స్​, కాలేజీల సమీపంలో ఈవ్​టీజింగ్ ​చేసేవారు. కానీ పోలీసులు మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు షీటీమ్స్​ఏర్పాటు చేయడంతో ఇవి తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు ఈవ్​టీజర్లు రూట్ ​మార్చారు. ఆన్​లైన్​లో సోషల్​మీడియా వేదికగా వేధింపులు ఎక్కువయ్యాయి. కరోనా లాక్​డౌన్​ తర్వాత యువతులు అంతా బయటకంటే ఆన్​లైన్​లోనే ఉంటుండడంతో ఈవ్​టీజింగ్​ మరింత పెరిగింది.  ఇటీవల హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ కమిషనరేట్లు విడుదల చేసిన డేటా దీన్ని బలపరుస్తున్నాయి. ఒక్కో కమిషనరేట్ పరిధిలో నెలలో వందకు పైగానే ఫిర్యాదులు వస్తుంటే ఇందులో 65 శాతానికి పైగా ఆన్​లైన్ ​వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. బాధితుల్లో టీనేజర్లు, 20 నుంచి 32ఏళ్ల వయస్సున్న మహిళలు ఎక్కువగా ఉంటున్నారని షీ టీమ్స్ అధికారులు చెప్తున్నారు. 

ఆన్​లైన్​లో తెలియని వ్యక్తులతో ... 

పబ్లిక్ ప్లేసుల్లో అల్లరి చేస్తే నలుగురు ఏమంటారోననే భయం ఉంటుంది. కానీ ఆన్​లైన్​లో ఈజీ యాక్సెస్ ఉండడంతో ఆకతాయిలు ఫేక్ ప్రొఫైల్స్​క్రియేట్ చేసి అమ్మాయిలను టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నారు. స్నేహం అంటూ మొదలుపెట్టి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని శారీరక సంబంధాలు పెట్టుకోవాలని బెదిరిస్తున్నారు. లేకపోతే అన్నింటిని బయటపెడతామని మానసికంగా వేధిస్తున్నారు. ఇట్లాంటి బాధితుల్లో 20 నుంచి 22 ఏండ్ల అమ్మాయిలు ధైర్యంగా డైరెక్ట్​గా షీటీమ్స్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటే టీనేజర్లు మాత్రం బయటపడలేకపోతున్నారు. కరోనా స్టార్టయినప్పటి నుంచి చాలామంది టీనేజర్లు, కాలేజ్ అమ్మాయిలు సోషల్ ప్లాట్ ఫామ్‌లకు అడిక్ట్​ అయ్యారు. పర్సనల్​ ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం మొదలుపెట్టారు. అన్‌నోన్ ఫ్రెండ్ షిప్ ​రిక్వెస్ట్​లను యాక్సెప్ట్​చేసి చాటింగ్​ చేస్తున్నారు. అవతల వ్యక్తిని పూర్తిగా నమ్మి వ్యక్తిగత విషయాలను చెప్పడంతో సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.

వందల్లో కేసులు.. 

హైదరాబాద్ షీటీమ్స్ కి జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల్లో 423 ఫిర్యాదులు రాగా, ఇందులో 203 మంది బాధితులు నేరుగా వెళ్లి కంప్లయింట్​ఇచ్చారు. మరో 181 మంది పోలీసుల దగ్గరకు వెళ్తే ఏమవుతుందోనని భయపడి వాట్సాప్ ద్వారా కంప్లయింట్ ​చేశారు. సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 355 కంప్లయింట్స్​వచ్చాయి. ఇందులో 141 కేసులు ఫోన్​ హరాష్​​మెంట్ వి కాగా, సోషల్ మీడియాలో వేధించినవి 33, బ్లాక్ మెయిలింగ్ కు సంబంధించినవి 34  ఫిర్యాదులు ఉన్నాయి. రాచకొండ షీటీమ్స్ ఎనిమిది వారాల్లో 79 మంది ఈవ్ టీజర్లను కటకటాల్లోకి తోసింది. కొన్ని రోజుల కింద స్టార్ మేకర్ వంటి యాప్‌లలో ఉండే అమ్మాయిల నంబర్లను తీసుకుని వాట్సాప్‌లలో మెసేజ్ చేస్తూ, ఫొటోలు, వీడియోలు పంపిస్తూ అసభ్యకరంగా ప్రవరిస్తున్న ఓ నిందితుడిని మాదాపూర్ షీటీమ్ పోలీసులు పట్టుకున్నారు. కర్మాన్ ఘాట్ కి చెందిన 25 ఏండ్ల  నితిన్ గుప్తా తనతో కాలేజీలో చదివిన అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్ లో  ప్రేమించాలని మెసేజ్‌లు పెట్టి వేధించాడు. మితిమీరడంతో విసిగిపోయిన అమ్మాయి నితిన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా పోలీసులకు కంప్లయింట్​చేయడంతో పట్టుకుని మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదుచేశారు. ఇలాంటి కేసుల్లో కొంతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తుండడంతో నిందితులు పట్టుబడుతున్నారు. 

రియాక్ట్ అవ్వాలి..

ఈ మధ్య ఆన్​లైన్​వేధింపులు పెరిగాయి. అన్ని ఏజ్ గ్రూప్ ల మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆన్​లైన్ ​స్నేహాల ద్వారానే ఈ రకమైన వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ విషయం తెలిసినా కంప్లయింట్​ ఇవ్వడానికి భయపడుతున్నారు. తర్వాత బయటకు తెలిస్తే ఏమవుతుందోనని ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. ఐటీ కంపెనీల్లో పని చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిల కోసం మేం 10 నిమిషాల వీడియో తయారు చేశాం. జాబ్ లో జాయిన్ అయ్యేముందు ఆ వీడియో చూసి చివరిలో వచ్చే టెస్ట్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మా పరిధిలో 11టీమ్‌లు ఉమెన్ సేఫ్టీ మీద స్కూల్స్, కాలేజీలు, ఇతరత్రా ప్లేసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
– సి అనసూయ (డీసీపీ, సైబరాబాద్)

కేసులు పెరిగాయి

గతంతో పోలిస్తే ఆన్​లైన్​ వేధింపులతో మా దగ్గరకు వస్తున్న వారు పెరిగారు. పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్లని శత్రువులుగా చూస్తూ టీనేజ్ అమ్మాయిలు బయట ప్రేమ వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్​లైన్ స్నేహాల వలలో పడుతున్నారు. బయటపడలేక చనిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటివి తెలుసుకుంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలను మా దగ్గరకు తీసుకొస్తున్నారు. దాదాపు నాలుగైదు సెషన్ల ద్వారా వారి ఆలోచనలను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. పదో తరగతి అయిపోయిన 18 ఏండ్ల లోపు ఉన్న అమ్మాయిల కేసులే ఎక్కువగా చూస్తున్నాం. –అనిత ఆరే (క్లినికల్ సైకాలజిస్ట్‌)