Harbhajan Singh: మా నాన్నను కొట్టావు, నీతో మాట్లాడను: శ్రీశాంత్ కూతురు మాటలకు బాధపడిన హర్భజన్

Harbhajan Singh: మా నాన్నను కొట్టావు, నీతో మాట్లాడను: శ్రీశాంత్ కూతురు మాటలకు బాధపడిన హర్భజన్

ఐపీఎల్ 2008 తొలి సీజన్ లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ను బహిరంగంగా చెంప దెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (అప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్) 66 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. పంజాబ్ తరపున ఆడుతున్న శ్రీశాంత్..మ్యాచ్ గెలిచిన తర్వాత దూకుడుతో కూడిన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పటికే మ్యాచ్ ఓడిపోయామనే నిరాశలో ఉన్న హర్భజన్ కు ఈ విషయం నచ్చలేదు. ఎమోషన్స్ అదుపులో పెట్టుకోలేక శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టాడు.

శ్రీశాంత్ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ గ్రౌండ్‌లోకి రావడం కనిపించింది. హర్భజన్ సింగ్ కొట్టినట్టుగా తప్పు ఒప్పుకోవడంతో మిగిలిన మ్యాచుల్లో ఆడకుండా ఐపీఎల్ మేనేజ్‌మెంట్ బ్యాన్ విధించింది. 17 ఏళ్ల తర్వాత ఈ సంఘటనపై హర్భజన్ మరోసారి స్పందించి ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ కూతురు తనతో మాట్లాడడని చెప్పినందుకు తాను చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇటీవలే అశ్విన్ నిర్వహించే ఆష్‌తో కలిసి కుట్టి స్టోరీస్ సీజన్ 3 లో పాల్గొన్న హర్భజన్ శ్రీశాంత్ సంఘటనను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. 

ALSO READ : IND vs ENG 2025: జురెల్‌కు లక్కీ ఛాన్స్.. నాలుగో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

హర్భజన్ మాట్లాడుతూ.. "నా జీవితంలో నేను మార్చుకోవాలనుకునేది 2008లో శ్రీశాంత్ తో జరిగిన చెంప దెబ్బ సంఘటన. ఆ సంఘటనను నా కెరీర్ నుండి తొలగించాలనుకుంటున్నాను. నేను చేసింది తప్పు. మరోసారి ఆ తప్పును చేయకూడదు అనుకున్నాను. నేను 200 సార్లు క్షమాపణలు చెప్పాను. ఆ సంఘటన తర్వాత కూడా నాకు చాలా బాధగా అనిపించింది. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి  నేను క్షమాపణలు చెబుతున్నాను. అది ఒక పొరపాటు". అని హర్భజన్ కుట్టి స్టోరీస్ విత్ యాష్ షో లో చెప్పుకొచ్చాడు. 

"నేను తన కూతురిని కలిసినప్పుడు తనతో ఎంతో ప్రేమగా మాట్లాడాను. కానీ తను మాత్రం మీరు, మా నాన్నని కొట్టారు. నేను మీతో మాట్లాడనని చెప్పింది. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. బాధతో గుండె బరువెక్కింది. నా గురించి తను ఎలా ఆలోచిస్తుందో తలుచుకోవడానికి కూడా ధైర్యం చాల్లేదు. నేను, తన దృష్టితో తన తండ్రిని కొట్టినవాడిని మాత్రమే.. అది నన్ను ఇంకా బాధపెట్టింది. ఆ పాపకి కూడా క్షమాపణలు చెప్పడం తప్ప, ఇంకేమీ చేయలేను". అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.