జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉన్నప్పటికీ వన్డేలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. 2026 ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ కు ముందు పని భారం దృష్టిలో ఉంచుకొని పాండ్య, బుమ్రాలను కేవలం టీ20 మ్యాచ్ లనే ఆడించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. వన్డేలకు దూరంగా ఉన్నా.. కివీస్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు వీరిద్దరూ అందుబాటులో ఉండడం గ్యారంటీ.
పాండ్యకు గాయాల బెడద:
ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆ తర్వాత జరిగిన ఆసీస్ సిరీస్ కు అందుబాటులో లేడు. సర్జరీ నుంచి తప్పించుకున్న పాండ్య ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడి అద్భుతంగా రాణించాడు. వరుస గాయాలు పాండ్యను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆల్ రౌండర్ గా పాండ్య సేవలు టీమిండియా చాలా కీలకం. టీ20 వరల్డ్ కప్ ముగిసేవరకు బీసీసీఐ పాండ్యను కేవలం టీ20లకే పరిమితం చేయనున్నారు. దీంతో వన్డే సిరీస్ ఆడకపోయినా టీ 20 సిరీస్ లో కనిపించనున్నాడు.
బుమ్రాకు రెస్ట్:
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడిన బుమ్రా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాడు. రెండో టెస్ట్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ కు రెస్ట్ తీసుకున్న బుమ్రా ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడాడు. ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా ప్రధాన బౌలర్. ఇండియాలో జరగబోయే ఈ మెగా ఈవెంట్ బుమ్రా ఆడడం చాలా కీలకం. పని భారం కారణంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫాస్ట్ బౌలర్ ను వరల్డ్ కప్ ముందు వన్డేలు ఆడిస్తే బుమ్రా అలసిపోతారు. కాబట్టి వన్డేలకు బుమ్రాను ఆడించి బీసీసీఐ రిస్క్ చేయాలని భావించడం లేదు.
Also Read : షారుఖ్ ఖాన్ దేశద్రోహి.. అతని నాలుక కట్ చేసినవారికి రూ.లక్ష రివార్డు
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11న తొలి వన్డే జరగనుంది. వడోదర ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. కొత్త సంవత్సరంలో టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ ఇదే కావడంతో ఈ మెగా సిరీస్ కు భారీ హైప్ నెలకొంది. సొంతగడ్డపై జరుగుతుండడంతో ఈ సిరీస్ లో భారత జట్టు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తర్వాత టీమిండియా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.
