Hardik Pandya: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య ఔట్.. నితీష్‌కు బంపర్ ఛాన్స్

Hardik Pandya: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య ఔట్.. నితీష్‌కు బంపర్ ఛాన్స్

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే  పరిమిత ఓవర్ల సిరీస్ కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు పాండ్య కోలుకోవడం అనుమానంగా మారింది. మరో రెండు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. అక్టోబర్ 4 లేదా 5 న ఆస్ట్రేలియా టూర్ కు ఇండియా స్క్వాడ్ ను ఎంపిక చేయనున్నారు. 

పాండ్య స్థానంలో నితీష్ కు ఛాన్స్: 

రిపోర్ట్స్ ప్రకారం గాయంతో బాధపడుతున్న హార్దిక్ కు నాలుగు వారాల రెస్ట్ కావాలని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. పాండ్య వన్డే సిరీస్ కు దూరమైనా త్వరగా కోలుకుంటే ఆ తర్వాత జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీమిండియా ఆల్ రౌండర్ గాయంపై బీసీసీఐ వైద్య బృందం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటివరకు 94 వన్డేలు ఆడిన హార్దిక్.. ఈ ఫార్మాట్ లో టీమిండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. హార్దిక్ వన్డే ఖాతాలో ఇప్పటివరకు 1904 పరుగులు.. 91 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ పాండ్య దూరమైతే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం నితీష్ కుమార్ రెడ్డి భర్త జట్టులో ఎంపిక కావచ్చు. 

ఆసియా కప్ లో రాణించిన హార్దిక్:

ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో పాండ్య రాణించాడు. ఆల్ రౌండర్ గ తన బాధ్యతను సమర్ధవంతంగా పోషించాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లోనూ పాండ్య ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్ లో 28 బంతుల్లోనే 38 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోవడంతో అతని స్థానంలో దూబే ఇండియాకు తొలి ఓవర్ లో బౌలింగ్ చేశాడు.        

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్:
 
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.